భర్త చనిపోయాడని నకిలీ పత్రాలు సృష్టించిన భార్య అరెస్టు | - | Sakshi
Sakshi News home page

భర్త చనిపోయాడని నకిలీ పత్రాలు సృష్టించిన భార్య అరెస్టు

Oct 7 2026 2:16 AM | Updated on Oct 7 2026 2:16 AM

భర్త చనిపోయాడని నకిలీ పత్రాలు సృష్టించిన భార్య అరెస్టు విద్యతోపాటు కమ్యూనికేషన్స్‌ ప్రధానం ఉరేసుకుని యువకుడు మృతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ

పెనమలూరు: బతికి ఉన్న భర్త చనిపోయాడని నకిలీ పత్రాలు సృష్టించిన భార్య, ఆమెకు సహకరించిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ ఉషారాణి తెలిపిన వివరాల ప్రకారం.. కానూరుకు చెందిన ఎర్రంశెట్టి రమాదేవి భర్త మురళీకృష్ణకు విభేదాల కారణంగా విడిపోయారు. ఒంటరిగా ఉంటున్న ఆమె ప్రభుత్వం ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్‌ పొందటానికి ఆమె పథకం వేసింది. తన భర్త మురళీకృష్ణ చనిపోయినట్లు విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ శానటరీ ఇన్‌స్పెక్టర్‌ ఆంటోనిని కలిసి రూ 15 వేలు లంచం ఇచ్చి క్రిమేషన్‌ సర్టిఫికెట్‌ పొందింది. ఆ సర్టిఫికెట్‌తో తాడిగడప మున్సిపాలటీలో మరణ ధ్రువీకరణ పత్రం పొందింది. ఇది ఇలా ఉండగా కలిదిండిలో ఉన్న భర్త మురళీకృష్ణ అనారోగ్యం కారణంగా వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆయన మృతి చెందినట్లు రికార్డుల్లో కనబడింది. దీంతో బాధితుడు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా నకిలీ మరణ ధ్రువీకరణ గుట్టురట్టయింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉద్యోగం సాధించాలంటే కేవలం చదువు ఒక్కటే చాలదని, స్కిల్‌ కమ్యూనికేషన్స్‌ పెంపొందించుకోవల్సిన అవసరం ఉందని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కూన రాంజీ అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన నలంద డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్‌ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందేందుకు కావాల్సిన స్కిల్స్‌ కోసం కృష్ణా యూనివర్శిటీ ఎప్పటికప్పుడు కొత్త కోర్సును ప్రారంభించడంతోపాటు వర్శిటీ అనుబంధ కళాశాలల్లో కూడా ప్రారంభించే విధంగా ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల్లో విజయవాడ నలంద డిగ్రీ కాలేజి ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. నలంద విద్యా సంస్థల చైర్మన్‌ ఎ.విజయబాబు మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కోర్సులను మార్పు చేసుకుంటూ విద్యార్థి సమగ్ర వ్యక్తిత్వ వికాసం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.అనురాధ మాట్లాడుతూ తమ కాలేజి ఫలితాల్లోను, ఉపాధి అవకాశాలు కల్పించడంలో అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఈ సందర్భంగా అకడమిక్‌ టాపర్స్‌కు జ్ఞాపిక, ప్రశంసా పత్రం బహూకరించారు.

పెనమలూరు: ఉరేసుకొని యువకుడు మృతి చెందిన ఘటనపై కానూరు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ మండలం బొమ్మలూరుకు చెందిన కిలారు రామ్‌కుమార్‌(28) రెండేళ్లుగా విజయవాడలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కానూరు కల్పనానగర్‌ ప్రభాకరరావు వీధిలో గ్రూప్‌హౌస్‌లో ఉంటున్నాడు. సోమవారం మిత్రుడు కొడెబోయిన సాయిప్రీతమ్‌ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో రాత్రి రామ్‌కుమార్‌ ఉంటున్న ఇంటికి వచ్చాడు. అతను సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉండటం చూసి, వెంటనే తండ్రి ఈశ్వరరావుకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలం వద్దకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఎంపిక కావాలని డీఈవో కార్యాలయం ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్‌ రాంబాబు అన్నారు. ఎన్‌టీఆర్‌ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు శ్రీధర్స్‌ సీసీఈ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు స్టడీ మెటిరియల్‌ను అందించారు. శ్రీధర్స్‌ సీసీఈ డైరెక్టర్‌ కొమ్మూరు శ్రీధర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో మంచి ఫలితాలు సాధించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. పరీక్షలో కీలకమైన మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ కోసం తమ సంస్థలో విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. డీవైఈవో సాంబశివరావు, డీసీఈఈ కార్యదర్శి ఉమర్‌అలీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన స్టడీ మెటీరియల్‌తో పాటు సరైన మార్గదర్శకత్వం అందించడం ద్వారా ఎన్‌ఎంఎంఎస్‌ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement