పోలీస్‌ తీరు.. భద్రత బేజారు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ తీరు.. భద్రత బేజారు

Oct 7 2026 2:16 AM | Updated on Oct 7 2026 2:16 AM

దాడులు సర్వసాధారణం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడలో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మహిళల భద్రత మరింతగా దిగజారింది. మద్యం, గంజాయి వినియోగం పెరిగిపోయింది. గంజాయి మత్తులో ఆకతాయిలు ప్రవర్తిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. నగరంలో ఏకంగా ఒక మహిళా ఎస్‌ఐనే ఆకతాయిలు వేధించడం, వెంటబడటంతో ఆమె భవానీపురం స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వ్యవహారం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలకు నిదర్శనంగా మారింది.

గంజాయ్‌ మత్తే కారణం

ఇటీవల విజయవాడ నగరంలో గంజాయి వినియోగం గణనీయంగా పెరిగింది. గంజాయి మత్తులో ఆకతాయిలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పోలీసులు నైట్‌ పెట్రోలింగ్‌ను గాలికి వదిలేశారు. గంజాయిపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అయితే గంజాయి మూలాలను పూర్తిగా నిర్మూలించడంలో వైఫల్యం చెందుతున్నారు. గంజాయి రవాణాలో కింగ్‌పిన్‌గా ఉన్న సొహైల్‌ పటమట పోలీసు స్టేషన్‌ నుంచి తప్పించుకుని చాలా రోజులైంది. అయితే ఇప్పటి వరకూ అతడిని అదుపులోకి తీసుకోలేదు.

● మూడు రోజుల క్రితం గొల్లపూడి బైపాస్‌ రోడ్డులో కారులో వెళ్తున్న మహిళా ఎస్‌ఐ కుటుంబాన్ని జోజీనగర్‌ చౌరస్తా వద్ద ఆకతాయిలు వేధించారు. దీంతో ఆ మహిళా ఎస్‌ఐ భవానీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకతాయిలు మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు.

● గతేడాది పటమట పంటకాలువ రోడ్డులో ఇద్దరు యువకులు కారులతో ఎదురెదుగా వచ్చి ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో యువకులు ఇద్దరు మద్యం మత్తులో ఉండటంతో పాటు, ఓ వాహనంలో యువతి ఉందని, ఆమె విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం జరిగిందని సమాచారం. ఈ విషయం అప్పట్లో నగరంలో సంచలనంగా మారింది.

● లబ్బీపేట ఎంజీ రోడ్డులో ఉన్న ఓ పబ్‌లో మద్యం తాగిన యువకులు అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చి రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన ఇటీవల జరిగింది.

● క్రీస్తురాజు పురంలో స్నేహితుల మధ్య మందు పార్టీ విషయంలో వివాదం చెలరేగి, ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు దిగిన ఘటన గత ఏడాది జరిగింది.

● చిట్టినగర్‌లో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ బాలుడు వృద్ధుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఇటీవల జరిగింది. సింగ్‌నగర్‌లో బార్‌ వద్ద బీరు సీసాలతో మద్యం మత్తులో దాడులు జరిగాయి.

వీఐపీ బందోబస్తులకే పోలీసు సేవలు

ట్రాఫిక్‌ విధులు,

చలాన్లు రాయడంతో సరి

తీవ్రమైన లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు

మహిళా ఎస్‌ఐకే భద్రత కరువైన వైనం

నగరంలో మద్యం, గంజాయి మత్తులో దాడులు చేసుకోవడం సాధారణంగా మారింది. వారం రోజుల క్రితం సాయంత్రం ఆరు గంటల సమయంలో నందమూరి నగర్‌లో బంగారం షాపు నిర్వహించే వ్యాపారి ఇంట్లోకి ఒక వ్యక్తి బుర ఖాతో చొరబడి పిస్టల్‌ వంటి వస్తువు చూపించి ఇంట్లో ఉన్న వృద్ధురాలిని బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారం దోచుకెళ్లాడు. సీసీ టీవీ పుటేజీతోపాటు అన్ని వివరాలు అందించినా ఇప్పటి వరకూ దొంగను పట్టుకోలేదు. పోలీసులు సివిల్‌ పంచాయితీల్లో మునిగి తేలడంతో పాటు కీలకమైన నగరంలో కావడంతో వీఐపీల బందోబస్తు డ్యూటీలతో సతమతం అవుతున్నారు. మరో వైపు ఉన్న పోలీసులు కూడా రాత్రి సమయంలో సరైన గస్తీ మానేసి వెహికల్‌ చెకింగ్‌, చలానాలకు పరిమితం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆకతాయిలపై దృష్టి పెట్టి, గంజాయిని నిర్మూలించి శాంతిభద్రతలను పరిరక్షించాలని నగర ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement