మచిలీపట్నంఅర్బన్: ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ ఎంహెచ్‌సీజేఏసీ) ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద వైద్య, ఆరోగ్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం నుంచి విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ నిరసనకు సీఐటీయూ జిల్లా కమిటీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా ఏపీ ఎంహెచ్‌సీజేఏసీ చైర్మన్ పులి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 500 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సేవలకు దూరం కావడంతో వైద్య సేవలపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి, 100 శాతం గ్రాస్ జీతాన్ని పునరుద్ధరించాలని, పారా మెడికల్ కేడర్లలో రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కన్వీనర్ కే. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, డయాలసిస్, రేడియాలజీ, ఈసీజీ తదితర విభాగాల సిబ్బంది నిరసనలో పాల్గొన్నారని తెలిపారు. అత్యవసర సేవలను కొనసాగిస్తూ మిగిలిన సేవలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే నిరసనను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీసీఎన్‌ఏ వైస్ ప్రెసిడెంట్ సౌమ్యరేఖ బోకినాల, జిల్లా జేఏసీ కోఆర్డినేటర్ లోకేష్ కుమార్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, కార్యదర్శి బూర సుబ్రమణ్యం, మండల కన్వీనర్ సిహెచ్.జయరావు, ఏపీ ఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకూరి శ్రీనివాస్‌రావు, వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


