కళ్లకు గంతలతో కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

కళ్లకు గంతలతో కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

మచిలీపట్నంఅర్బన్‌: వైద్య, ఆరోగ్యశాఖలో ఏళ్ల తరబడి కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి.సౌమ్యరేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఏపీ ఎంహెచ్‌సీజేఏసీ) ఆధ్వర్యంలో న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రాష్ట్రవ్యాప్త శాంతియుత పోరాటంలో భాగంగా మంగళవారం మచిలీపట్నంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నల్ల బెలూన్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సౌమ్య రేఖ మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రాస్‌ శాలరీ చెల్లింపు తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్క రించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తే పోరాటాన్ని మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 30 రోజుల శాంతియుత కార్యాచరణలో భాగంగా విధుల బహిష్కరణను తాత్కాలికంగా వాయిదా వేసి తొలి దశ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఏపీ ఎన్జీఓస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్య క్షుడు ఆకూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి.దయాకర్‌కు కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల సుబ్రహ్మణ్యం, జిల్లా జేఏసీ అధ్యక్షుడు పులి ప్రవీణ్‌కుమార్‌, జిల్లా జేఏసీ కోఆర్డి నేటర్‌ లోకేష్‌కుమార్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ చంద్రపాల్‌, కాంట్రాక్టు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement