ముంచెత్తుతున్న ప్లాస్టిక్‌ | - | Sakshi
Sakshi News home page

ముంచెత్తుతున్న ప్లాస్టిక్‌

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోతున్న కాలువలు, డ్రెయిన్లు విజయవాడలో రోజురోజుకు పెరుగుతున్న వ్యర్థాల ఉత్పత్తి పర్యావరణ పరిరక్షణకు తీసుకున్నచర్యలు శూన్యమంటున్న నిపుణులు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కాలుష్యం విజయవాడ నగరాన్ని కబళిస్తోంది. వాహనాల నుంచి వస్తున్న ఉద్గారాలతోపాటు రోజూ ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం నిర్ధిష్టమైన చర్యలు చేపట్టకపోవటం వల్లే కాలుష్య తీవ్రత నానాటికీ ఉధృతమవుతోందని నివేదికలు చెబుతున్నాయి.

రోజుకు 600 టన్నుల చెత్త ఉత్పత్తి

విజయవాడలో రోజూ ఉత్పత్తయ్యే చెత్తకు సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నివేదికలు పలు అంశాలను స్పష్టం చేస్తున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో నిత్యం 550 నుంచి 600 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందులో 50 నుంచి 53 శాతం తడి లేదా బయోడీగ్రేడబుల్‌, 43 నుంచి 46 శాతం పొడి లేదా నాన్‌–బయోడీగ్రేడబుల్‌ వ్యర్థాలని అంచనా. దేశీయ ప్రమాదకర శానిటరీ వ్యర్థాలు 0.2 శాతం, పూల వ్యర్థాలు 0.4 శాతంగా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఆందోళన

నగరంలో ఉత్పత్తియ్యే చెత్తలో 20 శాతం ప్లాస్టిక్‌ ఉంటు న్నాయి. నిత్యం 78 నుంచి 80 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఇందులో ప్లాస్టిక్‌ ప్యాకింగ్‌ వ్యర్థాలు 60 టన్నులు. సింగిల్‌ యూజ్డ్‌ వ్యర్థాలు 20 శాతం, మిగిలినవి వివిధ రూపాల్లో వచ్చే ప్లాస్టిక్‌ వ్యర్థాలని అంచనా. ఇవన్నీ కాలుష్యాన్ని ప్రభావితం చేసేవే. వీటిని నిర్మూలించటం, తరలించటం వంటి అంశాల్లోనూ కాలుష్యం ఉత్పత్తవుతోంది. నగరంలోని కాలువల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవస్‌ కాలువతో పాటుగా బుడమేరు కాలువలు నగరం మీదుగా ప్రవహిస్తున్నాయి. ఈ కాలువల ద్వారా భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు తరలుతున్నాయి. వాటి వల్ల పర్యావరణం తీవ్రంగా ప్రభావితం అవుతోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కాలువల్లో, డ్రెయిన్లలో వేయటం తగదని సూచిస్తున్నారు.

నిషేధాలు ఉన్నా ఫలితం సున్నా

నిషేధాలు, తనిఖీలు, జరిమానాలు ఉన్నప్పటికీ నిత్యం 80 టన్నల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వస్తుండటం గమనార్హం. దీనిని బట్టి ఉన్న నిషేధాలు ఉన్నా అమలుకావడంలేదన్న వాస్తం అవగతం అవుతోంది. నగరంలో వివిధ రకాల ప్లాస్టిక్‌ ప్యాకింగ్‌ వస్తువుల విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. డిస్పోజల్‌ గ్లాస్‌లు, ప్లేట్లు, పాలిథిన్‌ కవర్లు, పలు రకాల గృహోపకరణాలు వంటి వస్తువులను సైతం భారీగానే విక్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్‌ వస్తువుల నియంత్రణ విషయంలో ఎక్కడా అధికారులు చిత్తశుద్ధిగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ప్లాస్టిక్‌ వ్యర్థాలపై సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సైతం ఆందోళన వ్యక్తం చేసినట్లుగా నివేదికలు వివరిస్తున్నాయి.

నిబంధనలు అమలు చేయాలి

కాలుష్య నివారణకు ప్రభుత్వం నిర్దేశిస్తున్న నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ప్రమాదకర ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించటం, నిషేధించిన ప్లాస్టిక్‌ వస్తువుల విక్రయాలపై నిఘా పెంచటం, కాలం చెల్లిన వాహనాల నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని నిపు ణులు సూచిస్తున్నారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విస్తృత చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని పర్యావరణ వేత్తలు గుర్తు చేస్తున్నారు. నగరంలో రోజురోజుకు దిగజారుతున్న పర్యావరణం ఓజోన్‌ పొరపై ప్రభావం చూపుతోందని, తత్ఫలి తంగా సూర్యడి నుంచి వచ్చే కిరణాలు జీవరాశిపై పడటం వలన అనేక దుష్ఫలితాలు చోటు చేసుకుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గాలిలో కాలుష్య తీవ్రతపై ఆందోళన

గాలిలో కాలుష్య తీవ్రతపైన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల ప్రయాణం, ఇతర వాహనాల నుంచి వచ్చే పొగ, ఉద్గారాలు పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మరో వైపు విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ను తగులబెట్టడం వల్ల డయాక్సిన్లు, ఫ్యూరాన్లు వంటి ప్రమాదకరమైన విషవాయువులు విడుదలై గాలి కలుషితమవుతోంది. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నిర్దేశించిన ప్రమాణాలు వరుసగా ఐదు సంవత్సరాలు దాటితే ఆ నగరాన్ని నాన్‌–ఎటైనిమెంట్‌ సిటీగా పేర్కొంటారు. ఆ జాబితాలో విజయవాడ ఉన్నట్లుగా నిపుణులు వివరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement