గంపలగూడెం: విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందాడు. గంపలగూడెం పోలీసులు తెలిపిన వివరాలు.. గొల్లపూడిలో మెరిగల అరవింద్(21) బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు తన ఇంటికి సంబంధించిన మోటార్ వైరు తెగిపోయింది. దానిని సరిచేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు తిరువూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అరవింద్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ విషయమై మృతుని బాబాయి మెరిగల కోటేశ్వరరావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో 14వ తేదీన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విజయవాడలీగల్: అక్రమ మద్యం కేసులో ఏ9 నిందితుడు తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి రిమాండ్ మంగళవారం ముగిసింది. దీంతో గుంటూరు జైలు నుంచి పోలీసులు వర్చువల్‌గా ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఎల్.తేజోవతి ఈనెల 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు.
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ఉతికిన బట్టలు ఆరేసేందుకు రెండస్తుల డాబాపైకి ఎక్కిన మహిళ ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెందిన ఘటన మండలంలోని కిలేశపురంలో సోమవారం జరిగింది. సేకరించిన వివరాల మేరకు.. గ్రామంలోని ఎస్టీ ఏరియాకు చెందిన బాణావత్ వాలి(60) బట్టలు ఉతికి ఆరేసేందుకు తన రెండస్తుల డాబాపైకి ఎక్కింది. బట్టలు ఆరేసే తాడు లూజుగా ఉండటంతో గట్టిగా బిగించేందుకు ఇంటికి ఉన్న పిట్టగోడపైకి ఎక్కింది. తాడును గట్టిగా లాగుతున్న క్రమంలో తాడుతెగి పట్టుతప్పి 30అడుగుల కిందకు పడిపోయింది. పడిన సమయంలో ప్రమాదాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు హుటాహుటిన తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


