బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌ గన్నవరం: ట్రావెల్స్‌ బస్సులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు గన్నవరం సబ్‌ డివిజన్‌ డీఎస్పీ కె. ధర్మేంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని అరెస్ట్‌ చూపించారు. పల్నాడు జిల్లా కారంపూడి గ్రామానికి చెందిన కుంచపు సురేష్‌ అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం మేరకు ఈ నెల 12వ తేదీ రాత్రి ఈగల్‌ టీమ్‌, గన్నవరం పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ సోదాల్లో ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణిస్తున్న సురేష్‌ను అదుపులోకి తీసుకుని 15 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సదరు గంజాయిని ఒడిశాకు చెందిన వెంకట్‌ అనే వ్యక్తి ద్వారా కేజీ రూ. 5వేలు చొప్పున సురేష్‌ కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నట్లు వివరించారు. సురేష్‌పై గతంలో విశాఖపట్నంలో రెండు గంజాయి కేసులు ఉన్నట్లు తెలిపారు. కంచరపాలెం పీఎస్‌లో నమోదైన కేసులో అరెస్టయిన సురేష్‌ గత జూన్‌లో షరతులతో కూడిన బెయిల్‌పై విశాఖపట్నం సెంట్రల్‌ జైలు నుంచి విడుదలైనట్లు చెప్పారు. ఇప్పటి వరకు గన్నవరం పీఎస్‌ పరిధిలో గంజాయి 140 కేజీల, గన్నవరం సబ్‌ డివిజన్‌ పరిధిలో 632 కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీఐ బీవీ శివప్రసాద్‌, ఎస్‌ఐ శ్రీధర్‌ పాల్గొన్నారు. గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం జి.కొండూరు: మండలంలోని కవులూరు గ్రామ శివారు బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌లో సోమవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం(సుమారు 55ఏళ్లు) ఉన్నట్లు గుర్తించిన స్థానిక రైతు డయల్‌ 100కి ఫోన్‌ చేసి చెప్పారు. జి.కొండూరు ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి సదరు మృతదేహాన్ని వెలికి తీయించారు. పంచనామా, ఇంక్వెస్ట్‌ నిర్వహించి పోస్టమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పట్టిసీమ నీటి ప్రవాహంలో మృతదేహం కొట్టుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. లభ్యమైన మృతదేహం పురుషుడిది అని తలపై కొంతభాగం బట్టతల ఉండి, నలుపు, నీలం రంగు టీ షర్ట్‌, కాఫీ రంగు లోదస్తులు ధరించినట్లు పోలీసులు తెలిపారు.

గుణదలలో..

గుణదల(విజయవాడ తూర్పు): గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం వద్ద గుర్తు తెలియని వృద్ధుడు మంగళవారం మృతి చెందాడు. మాచవరం ఎస్‌ఐ యోగేష్‌ తెలిపిన వివరాల ప్రకారం, పుణ్యక్షేత్ర ప్రధానాలయం గేటు వద్ద ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఇది గమనించిన భక్తులు 108కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆ వృద్ధుడిని పరీక్షించగా అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మాచవరం పోలీసులు వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా వృద్ధుడి వయసు 70 ఏళ్లు ఉంటుందని, ఇతని ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement