మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) టీజర్‌ను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ మంగళవారం ఆమె చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు డబ్ల్యూఏపీఎల్ గొప్ప వేదిక అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కల్యాణ్ కృష్ణ, ఏసీఏ సీఏవో జై కిషన్ ఆమెను కలిసి డబ్ల్యూఏపీఎల్ నిర్వహణ, టోర్నమెంట్ ప్రత్యేకతలు, మహిళా క్రికెటర్లకు కల్పిస్తున్న అవకాశాల గురించి వివరించారు.
ఎయిర్‌పోర్ట్ నిర్వాసితుల పక్షాన
ప్రజా సంఘాల పోరాటం
గన్నవరం: విమానాశ్రయ నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే అక్టోబర్ 2న ఆందోళనకు దిగుతామని ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేశారు. స్థానిక చింతపల్లి పాపారావు స్మారక భవనంలో మంగళవారం విమానాశ్రయ నిర్వాసితుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విమానాశ్రయ విస్తరణ కోసం దళితుల ఇళ్లు, స్థలాలు తీసుకున్న ప్రభుత్వం పుష్కర కాలమైన హామీలు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ నిర్ల క్ష్యం కారణంగా 427 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇక్కడి నిర్వాసితులకు రూ. 30కోట్లు కేటాయించకపోవడం శోచనీయమన్నా రు. ప్రజా సంఘాల నేతలు టీవీ లక్ష్మణస్వామి, ఎం. ఆంజనేయులు, కాట్రగడ్డ రామచంద్రజోషి, అభినాష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
కోనేరుసెంటర్: కృష్ణా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం పోలీసు క్వార్టర్స్‌లోని గణనాథుని ఆలయంలో వినాయకచవితి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు దంపతులు పీటలపై కూర్చుని గణనాథుని వేద మంత్రోచ్ఛరణల నడుమ వినాయకచవితి పండుగను జరిపించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. వినాయకచవితి పర్వదినం ప్రతి ఒక్కరికీ ఎంతో పవిత్రమైందని, విఘ్వేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.


