పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద ఏడాది పాటు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలం, ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ఆలయానికి రూ.92.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.50,05,000(పచ్చల శివప్రసాద్), మట్టికుండలు నిర్వహణ లైసెన్స్ హక్కునకు రూ.10,50,000(పచ్చల శివప్రసాద్), మునేరు అవతల 7 షెడ్లు, 4 ఏసీ గదులు, ఒక కల్యాణ మండపం నిర్వహణకు రూ.9,50,000(కొత్తపల్లి సతీష్‌కుమార్), ఆలయం వద్ద సంచారంగా ఐస్‌క్రీమ్ విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.5,10,000(ముండ్లపాటి నాగరాజు), భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరచు లైసెన్ప్ హక్కునకు రూ.3,15,000 (గడిపూడి గోపి), సులభ కాంప్లెక్స్ నిర్వహణకు రూ.11,80,000(నూతలపాటి సురేష్), పువ్వులు, పాలు, బియ్యం పోగుచేసుకునే హక్కునకు రూ.2,80,000(దండా పుష్పలత), హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్ హక్కును పొందారని తెలిపారు.
చిలకలపూడి(మచిలీపట్నం): పేదరికం నుంచి బయటకు తీసుకురావాలన్నదే పీ4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పీ4 కార్యక్రమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 78వేల మంది బంగారు కుటుంబాలు, 2,903 మంది మార్గదర్శిలను గుర్తించి 4,470 మంది బంగారు కుటుంబాలను దత్తత ఇచ్చామని తెలిపారు. మార్గదర్శిలు బంగారు కుటుంబాలకు వారికి కావాల్సిన సహాయం అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ సమాజంలో పేదరికం నిర్మూలనకు పీ4 కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, మార్గదర్శిలు చింతయ్య, తులసీదాస్ పాల్గొన్నారు.


