జోరుగా ఇసుక అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

జోరుగా ఇసుక అక్రమ రవాణా

Mar 22 2026 2:10 AM | Updated on Mar 22 2026 2:10 AM

● పోలంపల్లిలో అడ్డుకున్న గ్రామస్తులు ● ట్రక్కులు వదిలెళ్లిన ట్రాక్టర్‌ యజమానులు

వత్సవాయి/పెనుగంచిప్రోలు: జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతా ల్లోని మునేరు నుంచి అధికార పార్టీ నాయకులుకు ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. పగలు ట్రాక్టర్లతో డంప్‌ చేసి రాత్రుళ్లు తెలంగాణకు రవాణా సాగిస్తున్నారు. వత్సవాయి మండంలోని పోలంపల్లిలో మునేరు నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న 15 ట్రాక్టర్లను శనివారం తెల్లవారు జామున గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్‌ యజమానులు ఇసుకతో ఉన్న ట్రక్కులను అక్కడ వదిలేసి ట్రాక్టర్లతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు రెవెన్యూ సిబ్బందిని వాటికి కాపలాగా ఉంచారు.

తెలంగాణ చెంతనే ఉండటంతో..

రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నాయకులు కొందరు అడ్డగోలుగా మునేరు నుంచి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. నియోజకవర్గానికి సమీపంలోనే తెలంగాణ ప్రాంతం ఉండటంతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. వత్సవాయి మండలం నుంచి ఖమ్మంనకు ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుక రూ.5 వేలు, దగ్గరి ప్రాంతాలైతే దూరాన్ని బట్టి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇసుక రీచ్‌ల్లో యంత్రాల ద్వారా ట్రాక్టర్‌ లోడింగ్‌కు అధికార పార్టీ నాయకులు రూ.500 నుంచి రూ.600 అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఇటీవలన పెనుగంచిప్రోలు పోలీసులు అక్రమంగా హైదరాబాద్‌కు ఇసుక రవాణా చేస్తున్న తెలంగాణాకు చెందిన మూడు లారీలను పట్టుకున్నారు. లారీలకు ఎస్కార్ట్‌గా ముందు ఒక వాహనం ఉన్నట్లు కూడా గుర్తించారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో పెనుగంచిప్రోలుతో పాటు కొళ్లికూళ్ల, సుబ్బాయిగూడెం, వెంగనాయకునిపాలెం, గుమ్మడిదుర్రు, శనగపాడు, పోలంపల్లి, ఇందుగుపల్లి, కన్నెవీడు, శింగవరం, ఆళ్లూరుపాడు గ్రామాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించి డంపింగ్‌ చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్ల వద్ద మునేరులో సుమారుగా 15 గ్రామాలకు పైగా తాగు నీరు అందించే తాగునీటి పథకం వద్ద ఇష్టం వచ్చిన రీతిలో ఇసుక తవ్వకాలు చేస్తు న్నారని పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement