కనులపండువగా కల్యాణోత్సవం
ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు
మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య కల్యాణ మహోత్సవం కనుల పండువగా వైభవోపేతంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం స్వామివారి దివ్య కల్య్యాణం వేదపండితుల వేదమంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యాన వేద పండితులు కొమ్మూరి ఫణికుమార్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార్ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు స్వామివారి ఎదురుకోలు ఉత్సవం జరిగింది. రాత్రి 8 గంటలకు స్వామివారి ‘దివ్య కల్యాణ మహోత్సవం’ అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవదాయశాఖ తరఫున ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, కలెక్టర్ డీకే బాలాజీ దంపతులు స్వామివారు, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో చిన్నారులు ప్రదర్శించిన మురళీ కోలాటం ఆకట్టుకుంది. ఆలయ అనువంశిక ధర్మకర్త యార్లగడ్డ శివరాంప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
కనులపండువగా కల్యాణోత్సవం


