జనవరి 12న ఎన్జీవోస్ జిల్లా శాఖ ఎన్నికలు
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖకు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఎన్నికల అధికారి ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కె.జగదీశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ఈనెల 29న ఎన్జీవో హోమ్‌లో పబ్లిష్ చేస్తామన్నారు. జిల్లా శాఖకు ఒక అధ్యక్షుడు, ఒక సహాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, కార్యనిర్వాహక కార్యదర్శితోపాటు ఐదుగురు ఉపాధ్యక్షులు ఒక మహిళా ఉపాధ్యక్షురాలు – ఐదు సంయుక్త కార్యదర్శులు, ఒక మహిళ సంయుక్త కార్యదర్శి కలిపి మొత్తం 17 పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జనవరి 3న నామినేషన్లు స్వీకరణ, అదేరోజు పరిశీలన, అర్హుల జాబితా ప్రచురణ, నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా ప్రచురణ నిర్వహిస్తామన్నారు. సహాయ ఎన్నికల అధికారిగా రాష్ట సంఘ ప్రచార కార్యదర్శి బి.జానకి, పర్యవేక్షకుడిగా రాష్ట్ర కార్యదర్శి వి.సుబ్బారెడ్డి వ్యవహరిస్తారని ఎన్నికల అధికారి జగదీశ్వరరావు తెలిపారు.
హనుమాన్‌జంక్షన్‌రూరల్: సహకార రంగంలో పాడి పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో క్షీర విప్లవానికి నాంది పలికిన కాకాని వెంకటరత్నం సేవలు చిరస్మరణీయమని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. మాజీ మంత్రి, జైఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమాలు హనుమాన్‌జంక్షన్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక విజయవాడరోడ్డులోని పాలశీతల కేంద్రం ప్రాంగణంలో కాకాని వెంకటరత్నం విగ్రహానికి చలసాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తరుణంలో కాకాని వెంకటరత్నం చొరవతోనే రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు గ్రామగ్రామాన ఏర్పడ్డాయని చలసాని వివరించారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గానూ పాడి పరిశ్రమ అభివృద్ధికి, కృష్ణా మిల్క్ యూనియన్ బలోపేతానికి కాకాని విశేష కృషి చేశారని కొనియాడారు. పలువురు పాల సహకార సంఘాల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు.


