అనుమతులున్నా.. అడ్డుగోడ కట్టేశారు
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక జోజినగర్ ప్రాంతంలోని 42 ప్లాట్ల ప్రధాన రహదారి 2021లోనే రెగ్యులరైజ్ అయిన నేపథ్యంలో ఆ రోడ్ పక్కనే ఉన్న ఎస్‌కేటీ వెస్ట్ మెడోస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 72 కుటుంబాలకు, 42 ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ కోరారు. ఈ మేరకు ఆయన అపార్ట్‌మెంట్‌వాసులతో కలిసి సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రను కలిసి వినతి పత్రం అందజేశారు.
అన్యాయంగా గోడ కట్టారు..
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ 42 ప్లాట్ల యజమానులకు, అపార్ట్‌మెంట్ నివాసితులకు మున్సిపల్ కార్పొరేషన్ గతంలోనే అనుమతులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు సొసైటీ పేరుతో వచ్చి 42 ప్లాట్లను కూల్చివేయడంతోపాటు అపార్ట్‌మెంట్‌కు వెళ్లే దారిని కూడా మూసేస్తూ గోడ కట్టారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వారంతా తమ ఫ్లాట్లలోకి వెళ్లకుండా దౌర్జన్యంగా అడ్డుగోడ నిర్మించి నిలువరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వారిలో వృద్ధులు, అనారోగ్యంతో చికిత్స పొందున్నవారు, మహిళలు, పిల్లలు ఉన్నారని, కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ ధ్యానచంద్రను కలిసిన వారిలో వెస్ట్ మెడోస్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ఓనర్లు బెవర సాయి సుధాకర్, ఇల్లా భాస్కర్, గంజి జోషి ఉన్నారు.
వెస్ట్ మెడోస్ అపార్ట్‌మెంట్‌వాసులకు న్యాయం చేయాలని వినతి


