కొనసాగుతున్న పల్స్ పోలియో
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం రెండో రోజు కొనసాగినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కె. ప్రేమ్‌చంద్ తెలిపారు. సోమవారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామన్నారు. చిన్నారుల భవిష్యత్తు కోసం రెండే చుక్కలు నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలి రోజున జిల్లాలో మొత్తం 1,45,588మంది ఐదేళ్లలోపు చిన్నారులు లక్ష్యంగా ఉండగా, 1,34,643 మంది చిన్నారులకు (95.49 శాతం) పోలియో డోసులు వేసినట్లు వెల్లడించారు. మొదటి రోజు పోలియో చుక్కల పంపిణీలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారుల కోసం ఇంటింటి సర్వే నిర్వహించి, 124 మొబైల్ బృందాలు, 46 ట్రాన్సిట్ బృందాల సహకారంతో సోమవారం 2,592 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. జిల్లాలో ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా మంగళవారం సాయంత్రం ఐదు గంటలలోపు వంద శాతం లక్ష్యం పూర్తి చేయాలనే ఉద్దేశంతో వైద్య, ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు ప్రేమ్‌చంద్ పేర్కొన్నారు.


