చట్ట పరిధిలో సమస్యలకు పరిష్కారం
కోనేరుసెంటర్: ‘మీ కోసం’లో అందిన అర్జీలను చట్టపరిధిలో విచారణ జరిపించి సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని ఫిర్యాదులను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 40 అర్జీలు స్వీకరించారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
● పెడనకు చెందిన వనజ అనే వివాహిత ఎస్పీని కలిసి తన సమస్యను విన్నవించుకుంది. 9ఏళ్ల క్రితం తనకు వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. భర్త మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని వాపోయింది. అతనికి అడ్డు వస్తే తనతో పాటు పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వివరించింది. రక్షణ కల్పించి న్యాయం చేయాలని అర్జీ సమర్పించింది.
● పమిడిముక్కలకు చెందిన లక్ష్మి అనే వివాహిత తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. అందుకు అత్తమామలు అతనికి సహకరిస్తూ తనను మానసికంగా చిత్ర హింసలకు గురి చేస్తున్నారంటూ వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
● మచిలీపట్నం కుమార్ అనే వ్యక్తి ఎస్పీని కలిసి స్నేహితునికి ఆర్థిక అవసరాల నిమిత్తం ఎలాంటి ఆధారాలు లేకుండా ఐదు లక్షల రూపాయలు చేబదులుగా ఇచ్చానని చెప్పాడు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే తనను దుర్భాషలాడటమే కాకుండా కిరాయి వ్యక్తులను పంపించి తనపై దాడి చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ కోరాడు.


