ఆడుకుందాం.. ఆపేదెవరు?
పంట కాలువల ధ్వంసం..
ముందే ‘బరి’తెగిస్తున్న అధికార పార్టీ నేతలు
తిరువూరు: సంక్రాంతి జూదాల నిర్వహణకు తిరువూరు సర్కిల్లో ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరిలో మూడు రోజుల పాటు పండుగ జూదాలకు పోలీసుల నుంచి అనధికారిక అనుమతులు పొందే నిర్వాహకులు తిరువూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోడి పందేలు, కోతముక్కలు, లోన బయట, పులిమేక వంటివి నిర్వహిస్తారు. గతేడాది తిరువూరు, గంపల గూడెం, ఏకొండూ రు, విస్సన్న పేట మండలాల్లో రూ.20కోట్లకు పైగా సొమ్ము పండుగ జూదాల్లో చేతులు మారింది. ఈ ఏడాది కూడా పండుగ జూదాల కోసం మామిడితోటల్లో బరులకు సిద్ధం చేస్తున్నారు. రాత్రీపగలు జూదాల నిర్వహణకు అనువుగా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి బరుల చుట్టూ ఫెన్సింగ్ నిర్మించడం, ఇండోర్ స్టేడియం తరహాలో సీటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.
దూరప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు..
తిరువూరు నియోజకవర్గంలో జరిగే కోడిపందేలు, ఇతర జూదాలకు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పందెంరాయుళ్లు వస్తారు. వీరికి తిరువూరు పరిసరాల్లోని లాడ్జీలలో ముందస్తుగా గదులు బుక్ చేయడంతో పాటు మామిడి తోటల్లోనే తాత్కాలిక టెంట్లు వేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటారు. తిరువూరు మండలంలోని మల్లేల, కాకర్ల, తిరువూరు, గంపలగూడెం మండలంలోని పెనుగొలను, ఊటుకూరు, విస్సన్నపేట మండలంలోని కొండపర్వ, నరసాపురం, విస్సన్నపేట, ఏకొండూరు మండలంలోని గోపాలపురం, చీమలపాడులలో ఈ ఏడాది పందేల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. జూదాల్లో పేద, మధ్యతరగతి వర్గాలే ఎక్కువగా డబ్బు పోగొట్టుకునే పరిస్థితి ఉన్నప్పటికీ వీటిని నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారు.
స్టాల్స్ ఏర్పాటుకు డిపాజిట్లు..
జూదరులు, పందెంరాయుళ్ల వాహనాల పార్కింగ్, మద్యం అమ్మకాలు, భోజనం సరఫరా స్టాళ్ల ఏర్పాటుకు కూడా స్థలాలు శుభ్రం చేస్తున్నారు. వీటిని మూడురోజులు నిర్వహించినందుకు పందేల నిర్వాహకులు అద్దెలు నిర్ణయించి ముందుగానే వసూలు చేస్తున్నారు. గతేడాది సంక్రాంతి పండుగకు తిరువూరు నియోజకవర్గంలో మద్యం రెట్టింపు అమ్మకాలు జరగడంతో జూదాల్లో ఈసారి మద్యం స్టాల్స్‌కు అధిక మొత్తంలో వసూలు చేయనున్నారు.
సంక్రాంతి జూదాలకు భారీ ఏర్పాట్లు
ముందస్తుగా మామిడితోటల్లో
బరుల నిర్మాణం
పందెం రాయుళ్లకు ఆహ్వానాలు
స్టాల్స్ నిర్వహణకు వేలం పాటలు
జూదాల కోసం మామిడితోటలలో భూమి చదును చేయిస్తున్న నిర్వాహకులు.. తిరువూరు పట్టణంలోని రాజుపేటలో నాగార్జునసాగర్ కాలువ తూరలు, లాకులను ధ్వంసం చేశారు. పట్టణంలోని సాగునీటి చెరువులకు సాగర్ జలాలు సరఫరా చేసే కాలువ ధ్వంసం చేసిన నిర్వాహకులు హడావుడిగా మరో తూర వేసి చేతులు దులుపుకున్నారు. ఈ విషయమై సాగర్ అధికారులు సైతం స్పందించక పోవడం గమనార్హం.
ఆడుకుందాం.. ఆపేదెవరు?
ఆడుకుందాం.. ఆపేదెవరు?


