మంచి నడవడికతో మెలగండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): నేర ప్రవృత్తిని వీడి మంచి నడవడికతో మెలగాలని ఎన్టీఆర్ జిల్లాలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌లకు ఆదివారం పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు రూరల్ పరిధిలో డీసీపీ బి.లక్ష్మీనారాయణ, సిటీలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్ కౌన్సెలింగ్ ఇచ్చారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లు టాస్క్‌ఫోర్స్ కార్యాలయాల్లో ఆయా పోలీసు అధికారులు సిబ్బందితో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిల్లకల్లు జిల్లా పరిషత్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌లో డీసీపీ లక్ష్మీనారాయణ రౌడీషీటర్ల ప్రవర్తన మార్పుకోవాలని ఆదేశించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్ధాల వినియోగం, అక్రమ రవాణా చేయకుండా మంచి మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరు చెడు వ్యసనాలను దూరం చేసుకుని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరిపై పోలీస్ వారి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.


