వెరీ డేంజర్
అర్ధరాత్రి వరకు కుటుంబసభ్యులతో ఫుడ్‌స్టాల్స్‌లో గడపడం ఇళ్లలో ఉంటే స్మార్ట్‌ఫోన్‌లతోనే కాలక్షేపం నిద్రలేమి సమస్యలతో సతమతం తత్ఫలితంగా మానసిక, శారీరక సమస్యలు అప్రమత్తం కాకుంటే దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం
మిడ్‌నైట్ కల్చర్
శరీరానికి ఎనర్జీ కోసం ఆహారం ఎంత అవసరమో మెదడుకు నిద్ర కూడా అంతే అవసరం. మెదడు సక్రమంగా పనిచేయాలంటే ప్రతిరోజూ 6 నుంచి 8 గంటలు నిద్ర తప్పనిసరి. ప్రస్తుతం చాలామంది నిద్రలేమి కారణంగా అనేక శారీరక, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఇటీవల నగరంలో పెరిగిన మిడ్‌నైట్ కల్చర్ ఇందుకు ప్రధాన కారణం.
మంచి నిద్రపోవాలంటే...
● మనిషి శరీర తత్వాన్ని బట్టి రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర అవసరం అవుతుంది.
● ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకేసమయానికి నిద్రలేవడం చేయాలి.
● ఒకేసారి ఏకకాలంలో నిద్రపోవాలి. 4 గంటలు ఒకసారి, రెండు గంటలు మరోసారి కాదు.
● మంచి నిద్రకోసం బెడ్‌రూమ్‌ను చీకటిగా ఉంచుకోవడంతో పాటు, శబ్దాలు లేకుండా చూసుకోవాలి.
● నిద్రలోనే మెదడులోని వ్యర్ధాలు బయటకు వెళ్లి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
● విద్యార్థులకు సరిగా నిద్రలేకపోతే, రాత్రి చదివినవి ఉదయానికి గుర్తుండవు.
నిద్రలేమి సమస్య
గుర్తించిన సమస్యలివే...
● రాత్రివేళల్లో స్మార్ట్‌ఫోన్‌లు ఎక్కువ సేపు చూసే వారిలో కంటిలోని మెలకొనిన్ అనే పదార్ధం కరిగిపోతుంది. అలాంటి వారికి నిద్రపట్టదు. క్రమేణా నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది.
● నిద్రలేమితో కోపం, చిరాకు పెరిగిపోతుంటాయి. నిస్సత్తువ ఆవహించి, తెల్లారి లేచిన తర్వాత పనిపై దృష్టి పెట్టలేరు. వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతారు.
● పగలు చదివిన అంశాలు బ్రెయిన్‌లో స్టోర్ అవ్వాలంటే సరైన నిద్ర అవసరం. నిద్రలేమి సమస్య ఉన్న వారిలో చదివిన అంశాలు గుర్తుండని పరిస్థితి నెలకొంటుంది.
● ఒబెసిటీ ఉన్న వారు గురకతో రాత్రి వేళల్లో తరచూ తుళ్లిపడి లేస్తుంటారు. శ్వాసనాళాలు మూసుకుపోవడంతో గురకతో పాటు, ఒక్కోసారి గుండెపోటు, మెదడుపోటుకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి వారి ఆరోగ్య పరిస్థితిని స్లీప్ ల్యాబ్‌లో అధ్యయనం చేస్తారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలో మిడ్‌నైట్ కల్చర్ పెరిగింది. అర్ధరాత్రి వరకూ రోడ్లపై గడుపుతున్నారు. రాత్రి 10 గంటల తర్వాత కూడా కుటుంబ సమేతంగా ఫుడ్‌స్టాల్స్‌కు వస్తున్నారు. ఇక యువత ఇంట్లో ఉన్నా స్మార్ట్ ఫోన్‌లతో కాలక్షేపం చేస్తూ అర్ధరాత్రుళ్ల వరకు మెలకువగా ఉండడం మామూలైపోయింది. కళాశాలలు కూడా అసైన్‌మెంట్స్ ఫోన్‌లోనే ఇస్తుండడంతో ప్రతి విద్యార్థికి స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయింది. కొద్దిసేపు అసైన్‌మెంట్స్ చేసిన తర్వాత ఫోన్‌లలో రీల్స్ చూస్తూ సమయం అంతా వృథా చేస్తున్నారు. దీంతో నిద్రలేమి సమస్య వెంటాడుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు.
నిద్రలేమికి అనేక కారణాలు
నిద్రలేమికి అనేక కారణాలున్నాయి. వాటిలో రోజూ ఒకే సమయానికి పడుకోకపోవడం, సాయంత్రం 6 తర్వాత ఎక్కువగా టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు చూడటం, ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో పడుకోవడం, నిద్రలో గురక రావడం, నైట్‌షిప్ డిజార్డర్, రక్తహీనతలు ఉన్నాయి. నిద్రలేమి ఉన్న వారికి స్లీప్ ల్యాబ్‌లో స్టడీ చేస్తాం. ఆక్సిజన్ శాచురేషన్, బ్రెయిన్ యాక్టివిటీ, బాడీ యాక్టివిటీ, ఏ సైకిల్‌లో ఉన్నారో తెలుసుకుంటాం. అలా నిద్రలేమికి అంచనా వేసి అవసరమైన వైద్యం చేయడం, సూచనలు ఇవ్వడమో చేస్తుంటాం. వైద్యుల సూచన లేకుండా నిద్రమాత్రలు వాడటం సరికాదు.
– డి.అనిల్‌కుమార్, న్యూరాలజిస్ట్
●
వెరీ డేంజర్


