రేపటి నుంచి సిద్ధార్థలో అమరావతి బాలోత్సవం
200 స్కూల్స్ నుంచి హాజరు కానున్న 12 వేల మంది విద్యార్థులు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో 8వ అమరా వతి బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అమరా వతి బాలోత్సవం అధ్యక్షుడు ఎస్‌పీ రామరాజు చెప్పారు. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో బాలోత్సవం పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు మాట్లాడుతూ నగరంలోని పాఠశాలలతో పాటుగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పరిధిలోని సుమారు 200కు పైగా పాఠశాలల నుంచి దాదాపు 12 వేల మంది విద్యార్థులు ఈ బాలోత్సవంలో పాల్గొననున్నారని చెప్పారు. మంచి గాలి కోసం,మంచి జీవితం కోసంపర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఈ ఏడాది బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 47 అకడమిక్, 17 కల్చరల్ అంశాల్లో సబ్‌జూనియర్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో సిద్ధార్థ ఆడిటోరియంతో పాటుగా సిద్ధార్థ కళాశాల ఆవరణలో 15 వేదికలను ఏర్పాటు చేసి వాటిపై పోటీలను నిర్వహిస్తామని కొండలరావు వివరించారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ బాలోత్సవాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. బాలోత్సవం కమిటీ సభ్యులు మురళీ కృష్ణ, సాంబిరెడ్డి, వై.సుబ్బారావు, నాగళ్ళ విద్యాఖన్నా, రామరాజు తదితరులు పాల్గొన్నారు.


