జీవో నంబరు 36ను అమలు చేయాలి
నందివాడ: సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్‌ఆర్‌సీ పాలసీ అమలు చేస్తామంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 36ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు టీపీఎస్ హనుమంతరావు డిమాండ్ చేశారు. నందివాడ మండలం వెన్ననపూడి గ్రామంలోని సహకార సంఘ భవనంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జనవరి 5 వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 8వ తేదీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీ బ్రాంచీల ఎదుట సహకార సంఘాల ఉద్యోగులతో ధర్నా నిర్వహించి కంప్యూటర్ పనులు నిలుపుదల చేస్తామన్నారు. ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టి వినతిపత్రాలు అందిస్తామని, 22న డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఈ నెల 29న రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని, అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే జనవరి 5నుంచి నిరవధిక సమ్మె, రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. సహకార సంఘం ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు హనుమంతరావు


