మహనీయులను స్మరించుకోవడం కర్తవ్యం | - | Sakshi
Sakshi News home page

మహనీయులను స్మరించుకోవడం కర్తవ్యం

Nov 27 2025 5:46 AM | Updated on Nov 27 2025 5:46 AM

మహనీయులను స్మరించుకోవడం కర్తవ్యం

మహనీయులను స్మరించుకోవడం కర్తవ్యం

చిలకలపూడి(మచిలీపట్నం): ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం విరాజిల్లుతోందని, పటిష్టమైన మన రాజ్యాంగాన్ని తయారు చేసిన మహనీయులు అంద రినీ స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో సంయుక్త కలెక్టర్‌ ఎం.నవీన్‌తో కలిసి బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌ బాలాజీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ ప్రస్తావనను చదివి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. 1949 నవంబర్‌ 26వ తేదీన రాజ్యాంగాన్ని స్వీకరించినప్పటికీ 1950 జనవరి 26వ తేదీన సర్వసత్తాక సంపూర్ణ రాజ్యాంగ దేశంగా అవతరించి రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు. మనకు స్వాతంత్రం లభించినప్పుడు ప్రపంచంలోని రాజకీయ నాయకులు మన దేశం పదేళ్లలో ప్రజాస్వామ్యం పడిపోతుందని అనుకున్నారన్నారు. దేశంలో అక్షరాస్యత లేకున్నా పటిష్టమైన రాజ్యాంగం వల్ల ఇప్పటికీ ప్రజాస్వామ్యం నిలబడిందన్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులే ప్రభువులని స్పష్టం చేస్తూ రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్‌ అంబేడ్కర్‌, బాబు రాజేంద్రప్రసాద్‌, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్‌, బి.ఎన్‌.రావు వంటి మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం 20 రోజులుగా పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో విద్యా శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తత్వం, క్విజ్‌ పోటీల్లో సత్తాచాటిన వారికి కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు, పతకాలు అందజేశారు. విద్యార్థులకు మార్గ నిర్దేశం చేసిన ఉపాధ్యాయులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ శ్రీదేవి, కృష్ణా జిల్లా విద్యాధిశాఖాధికారి పి.వి.జె.రామారావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధి కారి చిన్న నరసింహులు, జిల్లా సైన్స్‌ అధికారి జాకీర్‌, కలెక్టరేట్‌ ఏఓ రాధిక, సిబ్బంది, ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement