పూసల దండల సేకరణకు రూ.8.67 లక్షలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్షల విరమణ అనంతరం మాలధారులు విడిచిపెట్టే పూసల దండలను సేకరించే హక్కు కోసం రూ.8.67 లక్షలు చెల్లించేందుకు ఓ కాంట్రాక్టర్ ముందుకు వచ్చారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్ని ధిలో మంగళవారం పూసల దండల సేకరణ హక్కు కోసం బహిరంగ వేలం జరిగింది. దేవస్థానం డిపాజిట్‌ను రూ.20 వేలుగా నిర్ణయించగా, 13 మంది కాంట్రాక్టరు పాల్గొన్నారు. గత ఏడాది ఈ వేలం ధర రూ.6.05 లక్షలు పలకగా, ఈ ఏడాది దేవస్థానం పాటను రూ.7 లక్షలుగా నిర్ణయించింది. బహిరంగ వేలం క్రమ క్రమంగా పెరిగింది. జి.దుర్గారావు రూ. 8.67 లక్షలు చెల్లించేందుకు ముందు కొచ్చారు. టెండర్ ప్రక్రియను ఏఈఓ ఎన్.రమేష్‌బాబు, ఆలయ లీజెస్ విభాగం అధికారులు పర్యవేక్షించారు. ఆలయ సిబ్బందితో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు (బుల్లాబ్బాయ్), రాఘవరాజు తదితరులు పాల్గొన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ పెట్టాడన్న ఆరోపణపై వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ షేక్ ఆదం షరీఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో నివసిస్తున్న షరీఫ్ ఇంటికి కొత్తపేట పోలీసులు మంగళవారం వేకువజాము నాలుగు గంటల సమయంలో వెళ్లి తలుపులు తట్టారు. బయటకు వచ్చిన ఆయన ఫోన్‌ను సీఐ కొండలరావు లాక్కుని పరిశీలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నట్టు ఫిర్యాదులు అందాయని చెబుతూ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలిసిన జెడ్పీ వైఎస్ చైర్పర్సన్ గరిక పాటి శ్రీదేవి, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు స్టేషన్‌కు తరలి వచ్చారు. సీఐ కొండలరావును కలిసి మాట్లాడారు. అరెస్టయిన షరీఫ్‌తో మాట్లాడి ధైర్యం చెప్పారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినవారిని అరెస్ట్ చేయవద్దని సుప్రీం కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ పోలీసులు వాటిని ధిక్కరిస్తూ వ్యవహరించటం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అక్రమ అరెస్ట్‌లు జరుగుతున్నాయని విమర్శించారు. రాత్రికి షరీఫ్‌ను పోలీసులు వదిలిపెట్టారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ – అనకాపల్లి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును మార్చి వరకు పొడిగిస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం తెలిపారు. సికింద్రాబాద్ – అనకాపల్లి ప్రత్యేక రైలు (07055) డిసెంబర్ నాలుగు నుంచి మార్చి 26వ తేదీ వరకు ప్రతి గురువారం, అనకాపల్లి – సికింద్రాబాద్ రైలు (07056) డిసెంబర్ ఐదు నుంచి మార్చి 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారం నడుస్తాయి.
అశ్లీల నృత్యాలు చేసిన హోంగార్డు సస్పెన్షన్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మహిళతో అశ్లీలంగా నృత్యం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఓ హోంగార్డుపై ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. బి.అజయ్ కుమార్ కంకిపాడు రూరల్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఉయ్యూరు మండలం గండిగుంటపాలెం గ్రామంలో పిల్లల సమక్షంలో ఓ మహిళతో అశ్లీలంగా నత్యం చేస్తూ వీడియో తీయించుకున్నాడు. ఆ వీడియోను స్నేహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం కాస్త అధికారుల దృష్టికి వెళ్లింది. మహిళతో హోమ్ గార్డ్ అశ్లీల నృత్యం విషయాన్ని అధికారులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరిపించిన ఎస్పీ వాస్తవాలు తెలుసుకొని మంగళవారం హోంగార్డు అజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పూసల దండల సేకరణకు రూ.8.67 లక్షలు
పూసల దండల సేకరణకు రూ.8.67 లక్షలు


