
కారులో నగదు చోరీ
తిరువూరు: స్థానిక బైపాస్‌రోడ్డులో సోమవారం సాయంత్రం ఆగి ఉన్న కారులో నగదు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. తిరువూరు ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచిలో రూ.లక్ష నగదు ఉపసంహరించిన అనంతరం కారు డ్యాష్‌బోర్డులో ఉంచిన మొగిలి సురేష్ బైపాస్‌రోడ్డుకు వెళ్లి మంచినీటి బాటిల్ కొనుగోలు చేయడానికి కారు రోడ్డు పక్కన నిలిపాడు. క్షణాల్లో కారులో నగదును గుర్తుతెలియని వ్యక్తులు తస్కరించి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరిన సీఐ గిరిబాబు, ఎస్‌ఐ సత్యనారాయణలు చోరీ జరిగిన తీరును పరిశీలించారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
నందివాడ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన నందివాడ మండలం ఇలపర్రు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కె. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఇలపర్రు గ్రామానికి చెందిన కూర్మ వెంకటేశ్వరరావు(26) తన ఇంటి వద్ద నుంచి గేదెలను మేతకు తోలుకొని ఇలపర్రు గ్రామ శివారులో ఉన్న చెరువు మీదకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ చెరువు మీద ఉన్న కరెంటు వైర్లు అతనికి తాకడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఈ విషయం చెరువు మీద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి మృతుని అన్నయ్య కూర్మ నాగరాజుకు తెలియపరిచాడు. అతను వచ్చేసరికి వెంకటేశ్వరరావు మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు.