
ఎంపీ అంటే మనీ ప్యాకింగ్ సర్వీస్‌లా మార్చారు..
గొల్లపూడి దేవస్థానం స్థలంతో తనకు సంబంధం లేదని, తాను కేవలం సభ్యుడినేనని ఎంపీ కేశినేని చిన్ని అబద్ధాలు ఆడుతున్నారని, సొసైటీ ఫర్ విజయవాడ వైబ్రెంట్‌కు అధ్యక్షుడిగా మొదటి పేరు ఆయనదే ఉందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. ఉత్సవాల పేరుతో డబ్బులు దండుకోవాలని ముందే పక్కా ప్రణాళికతో ఆ ప్రాంతంలో ఆరడుగుల ఎత్తున మట్టి పోశారని, ఇంత మట్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తోలించారో చెప్పాలని నిలదీశారు. అమ్మవారి ఉత్సవాలను దెబ్బతీస్తున్నారనే బాధతో ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు కోర్టుకు వెళ్తే ఎంపీ చిన్ని వైఎస్సార్ సీపీపై ఆరోపణలు చేస్తు న్నారని విమర్శించారు. ఎంతో ఖ్యాతి ఉన్న ఇంద్రకీలాద్రి అమ్మవారి ఉత్సవాల ప్రతిష్టను దిగజార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అమ్మవారి ఉత్సవాలకు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టని ఎంపీ విజయవాడ ఉత్సవాలకు పదిసార్లు రివ్యూ మీటింగ్‌లు ఎలా పెట్టారని ప్రశ్నించారు. తమ జేబులు నింపుకోవడం కోసం ఏటా పిన్నమనేని గ్రౌండ్‌లో జరిపే దసరా ఉత్సవాలను ఆపేయాలని అక్కడి నిర్వాహకులను ఎంపీ చిన్ని బెదిరించడం నిజం కాదా, విజయవాడ ఉత్సవాల కోసం మెడికల్ షాపు అసోసియేషన్‌ను రూ.2 కోట్లు డిమాండ్ చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు.