
మృతదేహానికి రీపోస్ట్‌మార్టం
నాగాయలంక: మండలంలోని నాలి గ్రామంలో గత నెల 28వ తేదీన ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిన యువకుడు నాయుడు దానియేలు(19) మృతదేహానికి గురువారం రీపోస్ట్ మార్టమ్ నిర్వహించారు. రిపోర్టు సమయంలో ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద కేసు కింద నమోదు చేశారు. దానియేలు మృతిపై అతడి తల్లి అమ్మాయమ్మ, ఇతర బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ మళ్లీ శవపరీక్ష జరి పించి న్యాయం చేయాలని గత వారం నాగాయలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు స్థానిక ఎస్‌ఐ కలిదిండి రాజేష్ ఫోరెన్సిక్ నిపుణులను గురువారం రప్పించారు. అవనిగడ్డ డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ, నాగాయలంక తహసీల్దార్ సీహెచ్.వి.ఆంజనేయ ప్రసాద్, అవనిగడ్డ సీఐ పి.యువకుమార్, మృతుని కుటుంబ సభ్యుల సమక్షంలో శవాన్ని బయటకు తీయించారు. బందరు నుంచి వచ్చిన ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం దానియేలు మృతదేహానికి రీ–పోస్ట్‌మార్టమ్ నిర్వహించింది. ఈ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.