
హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్టు
మైలవరం(జి.కొండూరు): మైలవరంలో తన రెండో భార్య కూతురు గాయత్రిని హత్య చేసి వాగులో పడేసిన చిందే బాజీపై పోలీసులు పీడీ యాక్టును అమలు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ హత్య చేసిన కేసులో బాజీ నేరం ఒప్పుకున్నప్పటికీ గాయత్రి శవం పోలీసులకు లభించకపోవడంతో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నాడు. అతనిపై గతంలో ఉన్న గంజాయి కేసులు, క్రిమినల్ కేసులు ఆధారంగా పోలీసులు పీడీ యాక్టును ప్రయోగించారు. గంజాయి విక్రయిస్తూ, రవాణా చేస్తూ పట్టుబడడంతో బాజీపై మైలవరం పోలీసుస్టేషన్‌లో మూడు గంజాయి కేసులు, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంలో ఒక గంజాయి కేసు నమోదైంది. జి.కొండూరు పోలీసుస్టేషన్‌లో ఒకటి, మైలవరం పోలీసుస్టేషన్‌లో ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతను పట్టుబడిన నాలుగు గంజాయి కేసుల్లో ఇప్పటి వరకు 27.170 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బాజీ మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ, యువతలో వ్యసనాన్ని పెంచుతూ, సమాజ శాంతికి ముప్పు కలిగిస్తున్నందున అతని నేర స్వభావాన్ని పరిగణలోకి తీసుకుంటూ పీడీయాక్టును అమలు చేసినట్లు సీఐ దాడి చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.