
ఎంపీగా చిన్ని అన్‌ఫిట్
విజయవాడ చరిత్రలో ‘కేశినేని చిన్ని’ అంత అవినీతిపరుడిని చూడలేదు ఎంపీ అంటే దండుకోవడం దాచుకోవడం అనే నిర్వచనం చెప్పారు వైఎస్సార్ సీపీ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్ తన అన్నయ్య కేశినేని నానిని చూసి సిగ్గు తెచ్చుకోవాలని చిన్నికి హితవు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఎంపీగా అన్‌ఫిట్ అని, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని ధ్వజమెత్తారు. ఎంపీ అంటే దండుకోవడం, దాచుకోవడం అని ఆయన కొత్త నిర్వచనం చెప్పారని ఎద్దేవా చేశారు. విజయవాడ చరిత్రలో ఎంతో మంది ఎంపీలుగా పనిచేశారు కానీ.. చిన్ని వంటి అవినీతి, అసమర్థ ఎంపీని తానెప్పుడూ చూడలేదన్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ ఆంధ్రప్రభకాలనీలోని జనహిత సదనంలో గురువారం వైఎస్సార్ సీపీ నేతలతో కలసి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ అయినా కూడా చిన్ని ఇంకా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లానే మాట్లాడుతున్నాడని, కనీస జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థాన భూములు పేర్ని నాని కొట్టేశాడంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2007 మార్చి 29వ తేదీన 5.30 ఎకరాలకు వేలం వేస్తే అందులో 135 మంది సభ్యులు మనిషికి రూ.2 లక్షల చొప్పున చెల్లించి పాల్గొన్నారని, వారిలో 50 శాతానికి పైగా టీడీపీ వారే ఉన్నారని, ముఖ్యంగా మంత్రి కొల్లు రవీంద్ర గుండెకాయగా చెప్పుకునే వ్యక్తులు కూడా ఉన్నారని గుర్తుచేశారు. ఎండోమెంట్స్ చట్టం, హైకోర్టు వేలం ద్వారా మాత్రమే దేవస్థాన భూములను లీజుకు ఇవ్వాలని చెబుతుంటే కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ దేవస్థాన భూముల్లో మట్టి తరలించా రని, అమ్మవారికి పోటీగా ఉత్సవాలు పెట్టడం వల్ల ఎవరికి లాభమో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికై నా అన్నయ్య కేశినేని నానిని చూసి ఎలా హుందాగా బతకాలో, ప్రజలకు ఎలా సేవ చేయాలో నేర్చుకోవాలని చిన్నికి హితవు పలికారు.
పాపపు సొమ్ముతో ఉత్సవాలా?
ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ చరిత్ర తెలి యకుండా విజయవాడ ఉత్సవాలను నిర్వహించాలని చూడటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మల్లాది విష్ణు పేర్కొన్నారు. వ్యాపారుల వద్ద బలవంతంగా చందాలు వసూలు చేస్తూ.. ఆ పాపపు సొమ్ముతో ఉత్సవాలు చేయడం దుర్మార్గమన్నారు. దేవుడి స్థలాల్లో గోల్ఫ్‌లు పెడతారా అని ప్రశ్నించారు. అమ్మవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ ఉత్సవాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన, నేడు కూటమి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు రావాలని కోరిన ఎంపీ చిన్ని సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని విష్ణు ప్రకటించారు.
అమ్మవారి ఖ్యాతిని తగ్గించొద్దు
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవాల పేరుతో ఆధ్యాత్మికతను దెబ్బతీసి, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఖ్యాతిని తగ్గించే పనులు చేయవద్దని హితవు పలికారు. విజయవాడ ఉత్సవాల పేరుతో ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా అక్రమ వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ చిన్ని 15 నెలల్లోనే కనీవినీ ఎరుగనంత అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఇసుక, మట్టి, బూడిద, స్థలాలతో పాటు ఇప్పుడు అమ్మవారి పేరుమీద కూడా అక్రమార్జన చేస్తున్నారని వివరించారు. అసలు ఈ సంఘం దేనికి పెట్టారు? 40 ఎకరాలకు కట్టిన రూ.45 లక్షలు ఎవరివి అని ప్రశ్నించారు. అక్కడ రూ.45 లక్షలు కట్టి ఇక్కడ ఒక్కో షాపునకు రూ.3.50 లక్షల చొప్పున రూ.కోట్లు దండుకుంటున్నారని వివరించారు. అసలు ఎండోమెంట్స్ భూములను ఇవ్వాలని కలెక్టర్ లెటర్ రాసివ్వడం ఎక్కడా చూడలేదని, దీనిపై కోర్టులకు వెళ్తామని, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఉత్సవాల ఖ్యాతిని దిగజార్చి, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.