సాక్షి దినపత్రిక నిజాలను నిర్భయంగా రాస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్‌గా నిలిచింది. పాలకుల అవినీతిని ఎత్తిచూపుతోంది. ఇది జీర్ణించుకోలేని ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఆ పత్రిక జర్నలిస్టులను అక్రమ కేసులతో వేధిస్తోంది. ఎడిటర్ ధనంజయరెడ్డిపైనా కేసులు నమోదు చేసింది. ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. ఇది సరైన విధానం కాదు. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.
– అవుతు శ్రీశైలజారెడ్డి, డెప్యూటీ మేయర్, విజయవాడ
కూటమి ప్రభుత్వం తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే ప్రశ్నిస్తున్న వారిపై కేసులకు తెగబడు తోంది. ప్రజలకు అలవికాని హామీలిచ్చి వాటిని విస్మరించిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పత్రికలపై, వాటి సంపాదకులపై కేసులు పెట్టడం దుర్మార్గం. ప్రజల ముందు సాక్ష్యాలు ఉన్నప్పటికీ బుకాయించటం, ప్రశ్నించిన వారిపై కూటమి పాలకులు ఎదురు కేసులు పెట్టడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. సాక్షి పత్రికపైనా, దాని సంపాదకుడు, జర్నలిస్టులపై పెట్టిన దుర్మార్గపు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
– షేక్ ఆసిఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ