బందరు టీడీపీలో ముసలం | - | Sakshi
Sakshi News home page

బందరు టీడీపీలో ముసలం

Sep 18 2025 7:51 AM | Updated on Sep 18 2025 7:51 AM

బందరు టీడీపీలో ముసలం

బందరు టీడీపీలో ముసలం

గొడుగుపేట వేంకటేశ్వరస్వామి భూమి విషయంలో వైఫల్యం ముఖ్యనేతల తీరుపై స్థానికుల అసహనం అధిష్టానానికి వాస్తవాలు చెప్పలేకపోయారని ఆగ్రహం విజయవాడ నేతలతో మంత్రి కొల్లు కుమ్మక్కయ్యారని ఆరోపణ ముఖం చాటేసి విదేశాలకెళ్లిన కొనకళ్ల నారాయణ

ఒక్క సెంటూ

దక్కనీయం..

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విజయవాడ గొల్లపూడిలోని మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 40 ఎకరాలకు సంబంధించిన తాజా పరిణామాలపై మచిలీపట్నం టీడీపీ ముఖ్య నేతల మధ్య ముసలం ముసురుకుంది. మచిలీపట్నం ముఖ్య నాయకులు విజయవాడకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యాపారులతో కుమ్మక్కై దేవస్థానం భూముల విషయంలో సహకరించారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఆ పార్టీ అధిష్టానం దృష్టికి వాస్తవాలను తీసుకెళ్లి దేవస్థానం భూములను కాపాడుకోవాలనే ఆలోచన కూడా చేయకపోవడాన్ని బట్టి నాయకుల తీరు తేటతెల్లమవుతోందని పార్టీలు, వర్గాలకు అతీతంగా బందరు వాసులు అభిప్రాయపడుతున్నారు.

దీర్ఘకాలిక ఎత్తుగడతో..

దసరా ఉత్సవాల సమయంలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు వినోద, ఆహ్లాద కార్యక్రమాల కోసం ‘విజయవాడ ఉత్సవ్‌’ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. దీని వెనుక దీర్ఘకాలిక ఎత్తుగడ ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గొడుగుపేట ఆలయానికి చెందిన 35 ఎకరాల్లో విజయవాడ ఉత్సవ్‌ పేరిట శాశ్వత ప్రాతిపదికన వార్షిక ఎగ్జిబిషన్‌, అయిదు ఎకరాల్లో గోల్ఫ్‌కోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నట్లు బందరు వాసుల దృష్టికి పదిరోజుల కిందటే వెళ్లింది. విజయవాడ పార్లమెంటు ముఖ్యనేత, విజయవాడకు చెందిన రాష్టస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌, బందరు రోడ్డులోని ఓ ప్రముఖ హోటల్‌ యజమాని, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు విజయవాడ ఉత్సవ్‌ పేరిట ఆలయ భూములను శాశ్వత ప్రాతిపదికన పొందేలా గూడు పుఠాణి చేస్తున్నారని అక్కడి ప్రజలు అంచనాకు వచ్చారు. ఇదే విషయాన్ని ముందుగానే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది కూడా.

అఖిలపక్షం సమావేశంలో చర్చించి..

ఆలయ భూముల విషయంలో ఏదో తేడా జరుగుతోందని భావించిన బందరులోని ధార్మిక సంస్థలు, వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ తదితర పార్టీలతో పాటు పలు సంఘాలు సమావేశమయ్యాయి. తమకు గాని, తమ పార్టీ నాయకులకు గాని ఏమీ తెలియదని టీడీపీ వారు తెల్లముఖం వేశారు. సమావేశం నుంచే జనసేన నాయకుడు ఎం.రాము మంత్రి కొల్లు రవీంద్రకు ఫోన్‌ చేసి ఆలయ భూములకు సంబంధించి ఏం జరుగుతోందని ప్రశ్నించగా.. తాను స్థానికంగా అందు బాటులో లేనని, గొడుగుపేట ఆలయ భూముల విషయం తన దృష్టికి రాలేదని, ఈ విషయంపై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌తో కూడా మాట్లాడతానని నమ్మబలికారు. ఆ సమావేశంలో పాల్గొన్న వైఎస్సాఆర్‌ సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆలయానికి సంబంధించి తమ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనేది వివరించారు. దేవస్థానానికి విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ సరైన ఆలనాపాలనా లేదని, వర్షం వస్తే స్వామి విగ్రహంపై చినుకులు పడుతుండటాన్ని గమనించి రూ.2 కోట్లతో త్రిదండి చినజీయర్‌ స్వామి ద్వారా ఆలయ పునర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించి పూర్తి చేసినట్లు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే ఆలయ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందనే ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

మరుసటి రోజే కొల్లు మాట మారింది..

సమావేశం మరుసటి రోజు ఉదయాన్నే ఆలయం వద్దకు వచ్చి ఎవరికీ, ఏ సొసైటీకి, ఏ అవసరాలకు భూములు ఇవ్వడంలేదని, కలెక్టర్‌కు చెప్పి ఆపించేస్తామని చెప్పిన మంత్రి కొల్లు రవీంద్ర మాట 24 గంటల్లోగా మారిందని సమావేశంలో పాల్గొన్న వారు గుర్తుచేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌, కొమ్మారెడ్డి పట్టాభి తదితరులను వెంటబెట్టుకుని మంత్రి రవీంద్ర రూ.45లక్షల చెక్కును దేవస్థానం వారికి అందజేశారని సుజయ్‌ కుమార్‌, రాజశేఖర్‌, అయోధ్యరామయ్య తదితరులు వివరించారు. తాము పరిస్థితులను అంచనా వేసుకున్నందునే న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు.

విదేశీ టూర్‌కు కొనకళ్ల..

స్థానికంగా టీడీపీలోని తాజా పరిస్థితులను అంచనా వేసుకున్న ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు ముఖం చాటేస్తూ బుధవారం విదేశాలకు పయనమయ్యారు. అమెరికాతో పాటు టర్కీ, మక్కా తదితర ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. బంధువుల వద్దకు అంటూ బయలుదేరిన ఆయన దసరా ఉత్సవాల తరువాతే తిరిగి రానున్నారు.

గొడుగుపేట ఆలయ భూములే కాదు రాష్ట్రంలోని ఏ ఆలయం, మరే ధార్మిక సంస్థకు చెందిన సెంటు భూమి కూడా పరులకు దక్కనీయకుండా అడ్డుకుంటా మని బందరుకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు బూరగడ్డ సుజయ్‌కుమార్‌ ‘సాక్షి’కి చెప్పారు. స్వామి భూమిని కాపాడుకోవడానికి తనతో పాటు వీహెచ్‌పీ, బీజేవైఎం నాయకులు రాజశేఖర్‌, అయోధ్యరామయ్య కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. కాగా సుజయ్‌కుమార్‌ పెడన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్‌ బాబాయ్‌ కుమారుడు. స్థానిక టీడీపీ నాయకులు సైతం ఆలయ భూముల విషయంలో మంత్రి కొల్లు తీరును తప్పుపడుతుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement