
అదే దౌర్జన్యం
బూడిద యార్డుకు వెళ్తున్న వారిని అడ్డుకున్న పోలీసులు
మాజీ మంత్రి జోగి రమేష్, వైఎస్సార్ సీపీ శ్రేణులు అరెస్ట్
ప్రజారోగ్యం బూడిదపాలవుతున్నా పట్టదా అంటూ ప్రశ్నించిన జోగి రమేష్
మైలవరం ఎమ్మెల్యే అక్రమాలు తారస్థాయి చేరాయని మండిపాటు
ఇబ్రహీంపట్నంలో బూడిద దోపిడీపై వైఎస్సార్ సీపీ పోరుబాట భగ్నం
ఇబ్రహీంపట్నం: బూడిద డంపింగ్‌లు, అక్రమ రవాణా, కాలుష్య నివారణపై వైఎస్సార్ సీపీ చేపట్టిన పోరుబాటను పోలీసులు భగ్నం చేశారు. మూలపాడు, జూపూడిలో టీడీపీ నేతలు అక్రమంగా డంపింగ్ చేసిన బూడిద నిల్వలు పరిశీలించి, లారీ ఓనర్లకు అప్పగించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి బుధవారం ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తమను వెళ్లనీయాలని జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి భర్త గరికపాటి రాంబాబు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించని పోలీసులు జోగి రమేష్‌తో పాటు పలువురు నాయకులను అరెస్ట్ చేసి వాహనంలో భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నాయకులు, కార్యకర్తలు జోగి రమేష్‌కు అండగా నిలిచి ప్లకార్డులు పట్టుకుని.. ప్రభుత్వం, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదా లు చేశారు. ఏసీపీ దుర్గారావు నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, 60మంది పోలీసు సిబ్బంది ర్యాలీని అడ్డుకోవడం గమనార్హం.
సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించాలి..
అరెస్ట్‌కు ముందు జోగి రమేష్ మాట్లాడుతూ బూడిద కాలుష్యం, అక్రమ బూడిద రవాణాపై వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు బూడిద లోడింగ్ అప్పగించి లోకల్ లారీ ఓనర్ల పొట్టకొట్టిందన్నారు. సుమారు 500 కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. కాలుష్యంతో నిండిపోయిన ఈ ప్రాంతంలో ఏపీ జెన్‌కో సంస్థ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించి పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. కాలుష్య నివారణకు మొక్కలు పెంచి, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోందని స్పష్టం చేశారు.
అరెస్ట్ అయ్యింది వీరే..
జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి, జి.కొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు, మేడపాటి నాగిరెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పచ్చిగోళ్ల పండు, గుంజా శ్రీనివాస్, మిక్కిలి శరభయ్య, మండల, పట్టణ అధ్యక్షులు రెంటపల్లి నాగరాజు, పోరంకి శ్రీనివాసరాజు, విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు బయ్యారపు రవికిషోర్‌ను అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అదే దౌర్జన్యం

అదే దౌర్జన్యం