
మైనార్టీల ద్రోహి గద్దే
లబ్బీపేట(విజయవాడతూర్పు): ముస్లింల చిరకాల ఆకాంక్ష అయిన షాదీఖానా నిర్మాణ పనులను నిలిపివేసి, ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ మైనార్టీలకు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. పిచ్చయ్యవీధి చివర బందరు కాల్వ ఒడ్డున గత ప్రభుత్వంలో ప్రారంభించిన షాదీ ఖానా పనులు నేటికీ పూర్తి కాకుండా, మధ్యలో నిలిపివేయడంతో దానిని వైఎస్సార్ సీపీ నేతలు బుధవారం పరిశీలించారు. తొలుత వైవీరావు ఆస్పత్రి రోడ్డులోని కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అలీం కార్యాలయం నుంచి పార్టీ నేతలు, ముస్లిం మైనార్టీలు షాదీఖానా వరకూ ర్యాలీగా వెళ్లారు.
అబద్దాలు చెబుతూనే ఉన్నారు..
దేవినేని అవినాష్ మాట్లాడుతూ మైనార్టీల చిరకాల కోరిక అయిన షాదీఖానా నిర్మాణాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించామన్నారు. మైనార్టీల కోసం నాడు వైఎస్ జగన్ ఆర్‌అండ్‌బీ స్థలాన్ని మున్సిపల్ శాఖకు బదిలీ చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా నిర్మాణం పూర్తి కాలేదని ఆరోపించారు. తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ మైనార్టీలను మోసం చేశారన్నారు. ఆయన 2014 నుంచి షాదీఖానా విషయంలో అబద్దాలు చెబుతూనే ఉన్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఇన్‌చార్జి మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన మహేష్, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మైనార్టీ నేతలు పాల్గొన్నారు.