
ఫెయిల్ చేయించారు
సక్సెస్‌ఫుల్‌గా
76 మందిని
పెడన: గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో సక్సెస్‌ఫుల్‌గా 76 మందిని ఫెయిల్ చేసినందుకు మీకు అభినందనలు. మీ స్కూలు అంత వరస్ట్ స్కూలు జిల్లాలో ఎక్కడా లేదు. మీలో మీరు పోట్లాడుకుంటే పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారు? మీ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులందరూ మధ్యాహ్న భోజనం చేయడం లేదంటూ జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు ఉపాధ్యాయులకు క్లాస్ పీకారు. ఆయన గురువారం పెడనలోని భట్ట జ్ఞానకోటయ్య(బీజీకే) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కలియతిరిగి ల్యాబ్, లైబ్రరీలను, తరగతి గదులకు తాళాలు వేసిన వాటిని పరిశీలించారు. ఆరు, పది తరగతులకు వెళ్లి విద్యార్థుల రీడింగ్ బుక్స్, వారు ఏ విధంగా పాఠాలు చదువుతున్నారో పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు హెచ్‌ఎం ఇందిర కూడా రావడంతో ఉపాధ్యాయులకు గట్టిగా క్లాస్ పీకారు. సక్సెస్‌ఫుల్‌గా 76 మంది విద్యార్థులను పదో తరగతిలో తప్పించారని, మీకు అభినందనలంటూ ఉపాధ్యాయులను ఉద్దేశించి డీఈవో వ్యంగ్యంగా అన్నారు. 2024–25లో పదో తరగతి పరీక్షకు ఎందరు హాజరైంది, తప్పిన వారి వివరాలు కూడా తెలియకుండా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చామని హెచ్‌ఎం ఇందిర చెప్పడంతో డీఈవో సీరియస్ అయ్యారు. వచ్చి రెండు నెలలు అవుతున్నా పాఠశాల గురించి తెలుసుకోకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనాన్ని 150 మందికి పైగా ఎందుకు తినడం లేదని ప్రశ్నించారు. కుళ్లిపోయిన కూరగాయలు వస్తున్నా వాటిని మీరు పట్టించుకోకపోవడం వల్ల, విద్యాబుద్ధులు సరిగ్గా చెప్పకపోవడం వల్ల విద్యార్థుల సంఖ్య పడిపోతోందన్నారు. కేవలం మీ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు బడులకు రావడం లేదంటూ కోపడ్డారు. విద్యార్థులు అధికంగా ఉంటేనే ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అదనపు తరగతులను కేటాయిస్తున్నా ఉపాధ్యాయులు తీసుకోవడం లేదని హెచ్‌ఎం డీఈవోకు ఫిర్యాదు చేశారు. పాఠశాల గేటు బయట వరకు మాత్రమే ఉపాధ్యాయ సంఘాలని, పాఠశాలలో అందరూ ఉపాధ్యాయులేనని డీఈవో స్పష్టం చేశారు. లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇవ్వాలని, ఆ ఆదేశాలు పాటించని వారికి మెమోలు ఇవ్వాలని, అదే మెమో తనకు కూడా పంపించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. డీఈవో ఎదురుగానే హెచ్‌ఎం ఇందిర, యూటీఎఫ్ నాయకుడు, ఉపాధ్యాయుడు ఉమామహేశ్వరరావు గొడవ పడటంతో ఇద్దర్నీ సస్పెండ్ చేస్తానని డీఈవో వారిని హెచ్చరించారు. బాపులపాడు కాకుండా విద్యాశాఖ కమిషనర్ మీ పాఠశాలను ఎంపిక చేసుకుని ఉంటే వికెట్లు పడిపోయేవని, మీ అదృష్టం బాగుందన్నారు. మీ స్కూలంత వరస్ట్ స్కూలు జిల్లాలో ఎక్కడా లేదని, మళ్లీ వస్తానని, పరిస్థితిలో మార్పు రాకపోతే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
జిల్లాలో ఇంత వరస్ట్ స్కూలు ఇంకెక్కడా లేదు సొంత పిల్లలపై చూపించిన శ్రద్ధ బడి పిల్లలపై ఎందుకు చూపించలేకపోతున్నారు? మీరే పోట్లాడుకుంటే పిల్లలకు ఏం చదువులు చెబుతారు? మీ నిర్లక్ష్యం వల్లే మధ్యాహ్నభోజనం అందరూ చేయడం లేదు పెడన బీజీకే జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయులకు క్లాస్ పీకిన డీఈవో