
యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్
తోట్లవల్లూరు(పమిడిముక్కల): రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ విమర్శించారు. ఎరువుల కృత్రిమ కొరతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పమిడిముక్కల తహసీల్దార్ నవీన్‌కుమార్‌కు గురువారం ఆయన రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కై లే మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతుల అవసరాలను అంచనా వేసి ఎరువులు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో రైతులకు పుష్కలంగా విత్తనాలు, ఎరువులు, సకాలంలో రైతుభరోసా అందించామని గుర్తుచేశారు. కానీ నేడు యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కోసం పీఏసీఎస్‌ల వద్ద రైతులు మండుటెండలో గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. సొసైటీల్లో పచ్చ చొక్కాలకు, పెద్ద రైతులకు ఎక్కువ మొత్తంలో ఎరువులు ఇస్తూ చిన్న, సన్నకారు, కౌలు రైతులను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా, డీఏపీ దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి రైతుల అవసరాలకు అనుగుణంగా రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా ఎరువులను సరఫరా చేయాలని అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్, మాజీ ఎంపీపీ సొంఠి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ సీతారామయ్య, కోఆప్షన్ సభ్యుడు దియావత్ ఆలీ, ఎంపీటీసీ సభ్యులు మేరుగు లక్ష్మి, వంశీ, ఆదిశేషు, నాయకులు చంద్రపాల్, బొల్లా సాంబశివరావు, నాగార్జున, బాబూరావు, యార్లగడ్డ శివ, అనుదీప్, కొక్కిలిగడ్డ ఆనంద్, పలువురు రైతులు పాల్గొన్నారు.