
పీ–4 కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పీ–4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలు – మార్గదర్శుల అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో పీ–4 కార్యక్రమం అమలుపై ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల కుటుంబాలను మార్గదర్శులకు అనుసంధానం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారన్నారు. జిల్లాలో ఇప్పటికే 60 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని వాటిని మార్గదర్శులతో అనుసంధానం చేసే ప్రక్రియ ఆశించిన విధంగా ముందుకు సాగటం లేదన్నారు. ముఖ్యంగా నియోజకవర్గానికి 8 నుంచి 10 వేల కుటుంబాలను మార్గదర్శిలకు అనుసంధానం చేయాలన్నారు. గ్రామాల్లో సచివాలయ సిబ్బందిని భాగస్వామ్యం చేసి వారి పరిధిలో జీవితంలో ఎదిగి సుస్థిరస్థానంలో ఉన్న మార్గదర్శకులను గుర్తించాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, సాంఘిక సంక్షేమ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్‌బాబు, డ్వామా పీడీ శివప్రసాద్, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేష్, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ