
రైతుబజారుల్లో సిండికేటుగాళ్లు!
చల్లపల్లి: జిల్లాలోని రైతుబజారుల్లో దళారుల హవా పెరిగిపోయింది. పాలకుల అండదండలతో కొందరు సిండికేటుగా మారి టమాటా ధరను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. రైతు బజారుల్లోని దుకాణదారులు టమాటాను తమ వద్దనే కొనాలని.. లేదంటే దుకాణం ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందేనంటూ హుకుం జారీ చేసి మార్కెట్‌పై వారి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారులు సైతం వారి ఒత్తిళ్లకు తలొగ్గి వారికి అండగా ఉంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
చల్లపల్లిలో ఇదీ పరిస్థితి..
చల్లపల్లి రైతుబజారులో 54 దుకాణాల వరకూ ఉండగా వాటిలో 10 వరకూ టమాటాలు అమ్మే దుకాణాలు ఉన్నాయి. ఇప్పటివరకూ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు విజయవాడ, మదనపల్లి, అనంతపురం ప్రాంతాల నుంచి ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ నుంచి దుకాణదారులే నేరుగా టమాటా దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. బయట వ్యక్తుల నుంచి టమాటా కొనడానికి వీలులేదని.. తమ వద్దే కొనాలని సిండికేటుదారులు బలవంతం చేస్తున్నారు. దీంతో ఎక్కువ, తక్కువలతో సంబంధం లేకుండా సిండికేటు వ్యక్తులు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా మార్కెట్‌లో రోజు రోజుకూ క్రమంగా టమాటా ధర పెరిగిపోతోంది. సిండికేటుదారులు రాక ముందు పది రోజుల కిందట చల్లపల్లి రైతు బజారులో కిలో టమాటా ధర రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.36కు పెరిగింది. ఈ అవకాశం కల్పించినందుకుగానూ సిండికేటుదారులు మోపిదేవి మండలానికి చెందిన కొందరు నాయకులకు ప్రతి నెలా భారీ మొత్తంలో ముడుపుల రూపంలో ముట్టజెప్పాలనే నిబంధన ఉన్నట్లు సమాచారం.
కృత్రిమ కొరత సృష్టించి..
చల్లపల్లి రైతు బజారు మాదిరిగానే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని రైతు బజారుల్లో కూడా కొందరు టమాటాను తమ గుప్పెట్లో పెట్టుకున్నట్లు సమాచారం. ఫలితంగా టమాటాకు కృత్రిమంగా కొరతతో డిమాండ్ సృష్టించి వాటి ధరలు మరింత పెంచి వినియోగదారుల జేబుకు చిల్లుపెట్టే ప్రమాదం ఉంది. అలాగే దళారులు ఎంత చెబితే అంతకే కొనాల్సి రావటంతో ఆశించిన స్థాయిలో లాభాలు ఉండటంలేదని వ్యాపారులు వాపోతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు..
రైతులు తమకు ఇష్టం వచ్చిన చోట లేదా వ్యక్తుల దగ్గర నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవచ్చు. ఫలానా వారి దగ్గరే కొనాలనే నిబంధన ఏమీ లేదు. దుకాణదారులను తమ దగ్గరే కొనాలని ఎవరైనా బెదిరిస్తే.. ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలి. వారిపై తగు చర్యలు తీసుకుంటాం.
– కె.చంద్రమోహన్,
ఈఓ, రైతుబజారు, చల్లపల్లి, కూచిపూడి
టమాటాలు తమ వద్దే కొనాలని హుకుం
కృత్రిమ కొరత సృష్టించి..
ధర పెంచుతున్న వైనం