
దుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల నేపథ్యంలో అమ్మవారికి సారెను సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్త బృందాలు తరలివస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు కుటుంబ సమేతంగానూ, కాలనీలు, అపార్టుమెంట్లలో నివాసం ఉండే వారు బృందాలుగా ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. తెల్లవారుజామున ఆరు గంటల నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఉదయం 10 గంటల తర్వాత రద్దీ అనూహ్యంగా పెరిగింది. రద్దీ నేపథ్యంలో మహా మండపంలోని లిఫ్టులను 5వ అంతస్తులోనే భక్తులను దింపేశారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం సుమారు వందకు పైగా భక్తబృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనాలు నిలిపివేయడంతో పాటు మధ్యాహ్నం రెండు గంటల వరకు రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. రూ.300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఇక సర్వ దర్శనానికి రెండు గంటల పైగానే సమయం పట్టిందని భక్తులు పేర్కొంటున్నారు.
వీకెండ్‌లోనూ రద్దీకి అవకాశం
రెండో శనివారం, ఆదివారం సెలవు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ ఈవో శీనానాయక్ అంచనా వేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను ఏ విధంగా ముందుకు నడపాలనే దానిపై శనివారం సిబ్బందికి సూచనలు చేశారు. ముఖ్యంగా 11.30 నుంచి 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేయగా, ఈ సమయాన్ని మరింత పెంచే ఆలోచన చేస్తున్నారు.

దుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న రద్దీ