
కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి
చిలకలపూడి(మచిలీపట్నం): దేశవ్యాప్తంగా 90 రోజుల్లో అత్యధిక కేసుల పరిష్కారం కోసం మీడియేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, న్యాయ మూర్తులు, న్యాయవాదులు కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి అన్నారు. బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా న్యాయ ప్రక్రియలో కూడా మార్పులు రావాలని, సత్వరమే న్యాయం అందిస్తే కక్షిదారులకు న్యాయవ్యవస్థపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. లోక్‌అదాలత్, మీడియేషన్ సెంటర్లలో కేసులు పరిష్కరించి కక్షిదారుల శాంతియుత జీవనానికి అందరూ సహకరించాలన్నారు.
ప్రతిష్ట మరింత పెంచే దిశగా..
కేసులు పరిష్కరించటంలో జిల్లా వ్యాప్తంగా 64 మంది శిక్షణ పొందిన న్యాయవాదులను, సోషల్ వర్కర్లను, మీడియేటర్లను ఏర్పాటు చేసినట్లు జడ్జి తెలిపారు. 90 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్‌గా జిల్లాలో అన్ని బార్ అసోసియేషన్లలో కేసులు పరిష్కరిస్తామన్నారు. న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య మాట్లాడుతూ సత్వరమే కేసులు పరిష్కరిస్తే న్యాయశాఖ గౌరవ ప్రతిష్టలు మరింత పెరుగుతాయన్నారు. శిక్షణ సమయంలో మీడియేటర్లతో ఉభయ పార్టీలను శాంతియుతంగా పరిష్కరించి అప్పీలు లేని విధంగా తీర్పులు ఇస్తామని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. పోతురాజు, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.