
‘లక్షలు ఇచ్చి కాంట్రాక్టు తెచ్చుకున్నాం.. ఇంటికి ఐదు వం
పటమట(విజయవాడతూర్పు): నగరంలో నిరంతర తాగునీటి సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. తుప్పు పట్టిన జీఐ పనులతో ఇనుప కిలుము, నలకలతో కూడిన నీరు కుళాయిల నుంచి వస్తున్నాయి. దీనికితోడు లీకేజీలు పెరిగిన కొండప్రాంతాలు, శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరా సమస్యాత్మకంగా మారింది. దీంతో పైపుల మార్పిడి అనివార్యం అయ్యింది.
నగరంలో కొత్త లైన్లు..
విజయవాడ నగరంలో నిరంతరం(24/7) తాగునీటి సరఫరా అందించేందుకు ఇంజినీరింగ్ విభాగం ఇటీవల ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నగరంలోని 64 డివిజన్లలో అమృత్ 1.0, అమృత్ 2.0లో పాతపైపులైన్లు తొలగించి కొత్తవి వేయటానికి నిధులు కూడా కేటాయింపులు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్‌లో గిరిపురం, ఉడ్‌పేట ప్రాంతంలో సుమారు 2వేల కుటుంబాలు నివాసాలుంటాయి. ఈ ప్రాంతంలో ప్రతి ఎసెస్‌మెంట్‌కు అమృత్ 1.0లో తాగునీటి కనెక్షన్ ఇవ్వాలని వీఎంసీ భావించింది. అందుకు అనుగుణంగా రూ. 50లక్షల వరకు నిధులు కూడా కేటాయించింది. దీనిపై ఇటీవల నగరానికి చెందిన ఓ కాంట్రాక్టరు టెండరు కూడా దక్కించుకున్నారు. సుమారు 25 కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుకు ఇరువైపులా, వీధుల్లో, సందుల్లో మెయిన్‌పైపు లైన్ల నుంచి ఇంటింటి కనెక్షన్ ఇచ్చేందుకు పైపులు వేశారు.
పైపు సైజ్ మార్చాలని చెప్పినా..
స్థానిక అవసరాలకు తగిన విధంగా గతంలో కంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో జనాభా పెరిగిందని, జనాభాకు అనుగుణంగా ప్రధాన పైపులైన్లు, ఇంటింటి కనెక్షన్లకు పైపుల సైజు పెంచాలని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. గతంలో మాదిరే 3ఎంఎం పీవీసీ పైపులైన్లు వేస్తున్నారు. అదీ నాసిరకం పైపులతో.. రోడ్డు మధ్య నుంచి ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చే సమయంలో ఏవైనా బరువైన వాహనాలు వాటిపై ఎక్కితే నుజ్జునుజ్జు అయ్యేంతలా అవి ఉన్నాయి.
ఆ నిబంధన సాకుతో వసూళ్లు..
రోడ్డు మధ్యలో నుంచి ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చేందుకు రోడ్డును తవ్వాల్సి ఉంది. తవ్విన రోడ్డును కాంట్రాక్టరే పూడ్చాల్సి ఉంది. ఇది సదరు కాంట్రాక్టరుకు టెండర్లలోనే నియమంగా ఉంచారు. దీన్నే అదునుగా చేసుకున్న కాంట్రాక్టర్ స్థానికుల నుంచి డబ్బులు వసూలు చేయటం ప్రారంభించారు. ‘మీ కోసం రోడ్డు తవ్వుతున్నాం.. మళ్లీ అది మేమే పూడ్చాలి.. ఇంకా మెయిన్‌లైన్ నుంచి ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చే కప్లింగ్ అందుకు అయ్యే ఖర్చు మీరే భరించాలి.. అందుకు ఇంటికి రూ. 500 ఇవ్వాలి.. లేనిపక్షంలో మీకు కనెక్షన్లు ఇవ్వం’ అని స్థానికులను బెదిరిస్తున్నారు. అదేమని అడిగితే కనెక్షన్ ఇవ్వను ఎవరికి చెప్పుకుంటారో అంటూ బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు వాపోతున్నారు.
రోడ్డుపై ప్రమాదకరంగా వదిలేసిన పైపులైన్లు
వీఎంసీలో వింత పోకడ తాగునీటి సరఫరాలో తారస్థాయికి అవినీతి స్థానికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ నాసిరకం పైపులతో ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లు
ఎవరికీ డబ్బులివ్వద్దు..
నూతన పైపులైన్లు వేస్తున్నాం. డబ్బులు ఇవ్వాలని ఎవరైనా అడిగితే వీఎంసీకి అధికారులకు ఫిర్యాదు చేయండి. ఎవరికీ పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వీఎంసీనే ప్రతి ఇంటికీ పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేస్తుంది. నాసిరకం పైపులు అనే అంశాన్ని సాంకేతికంగా ధ్రువీకరించుకోవాలి. కాంట్రా క్టరు ఎలాంటి పైపులైప్లు వేస్తున్నారో పరిశీలించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– సామ్రాజ్యం,
సర్కిల్–3 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
ప్రమాదకరంగా మారిన పైపులు..
ఈ ప్రాంతంలో కనెక్షన్లు ఇచ్చేందుకు వేసిన పైపులైన్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. రోడ్డుకి చివర కొసలు ఉంచేయటం, రోడ్డు వెంబడి చుట్టలుగా పైపులు వదిలేయటంతో రోడ్డులో ప్రయాణించే వారంతా ప్రమాదాలబారిన పడుతున్నారు. రోడ్డు మార్జిన్లలో ఉండటంతో వాహనాలకు తగలి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు.

‘లక్షలు ఇచ్చి కాంట్రాక్టు తెచ్చుకున్నాం.. ఇంటికి ఐదు వం