
అప్పుల బాధతో పురుగుల మందు తాగిన కౌలురైతు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
పెంట్యాలవారిగూడెం(వత్సవాయి): అప్పుల బాధ తట్టుకోలేక కౌలురైతు మృతిచెందిన సంఘటన గురువారం ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వత్సవాయి మండలం పెంట్యాలవారిగూడెం గ్రామానికి చెందిన తూనం రమేష్(50) మొదట్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. పదేళ్లుగా పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రెండు, మూడేళ్లుగా సాగు కలిసిరాక అప్పులు పెరిగిపోయాయి. గత ఏడాది 5 ఎకరాలలో మిర్చి పంట సాగు చేయగా సుమారు రూ.6 లక్షల వరకు అప్పు అయ్యింది. మొత్తం మీద రూ.15 లక్షల వరకు అప్పు ఉండడంతో ఏమి చేయాలో పాలుపోక అప్పు తీర్చే దారి తెలియక సోమవారం పొలం వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి పురుగులమందు డబ్బా తీసుకుని పొలం వద్దకు వెళ్లి తాగాడు. ఎంతకు రాకపోయే సరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. గురువారం సాయంత్రం పరిస్థితి విషమించి మరణించాడు. రమేష్‌కు భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేయగా కుమారుడు దివ్యాంగుడు కావడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు వత్సవాయి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జగ్గయ్యపేట తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.