
సేవలు దిగజారాయి..
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేరుకే సూపర్ స్పెషాలిటీ విభాగం.. దాని సేవలు చూస్తే సాధారణ వార్డుల కంటే దయనీయం. ఐసీయూల్లోకెళ్తే ఆరోగ్యవంతులు రోగాల బారిన పడటం తధ్యమని పలువురు అంటున్నారు. అంత ర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించిన విజయవాడ సూపర్ స్పెషాలిటీ విభాగంలో నేడు కూటమి ప్రభుత్వంలో సేవలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. అంతేకాక సెంట్రల్ ఏసీ పనిచేయక, ఫ్యాన్‌లు తిరగక ఉక్కపోతతోనే రోగులు ప్రాణాలు పోతాయా అనే సందేహం వస్తోంది. సగం విభాగాల్లో వైద్యులు లేక ప్రైవేటు ఆస్పత్రులకు తరలిపోవాల్సి వస్తోంది. లేదంటే గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ సేవలు పూర్తిస్థాయిలో లేక పోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
అందుబాటులో ఉన్న విభాగాలివే..
గత ప్రభుత్వం విజయవాడ జీజీహెచ్‌లో సూపర్‌స్పెషాలిటీ విభాగాలైన కార్డియాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, అంకాలజీ విభాగాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం వాటిలో కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ మినహా ఇతర విభాగాల్లో అరకొరగా సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు, బైపాస్ సర్జరీలు అవసరమైన వారు, కిడ్నీలు, బ్రెయిన్ రక్తనాళాలకు స్టెంట్స్ అవసరమైన వారు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
అరకొర సౌకర్యాలు..
ప్రస్తుతం యూరాలజీ, కార్డియో థోరాసిక్‌సర్జరీ విభాగాల్లో వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ అరకొర సౌకర్యాలు ఉండటంతోనే శస్త్ర చికిత్సలు చేయలేక పోతున్నట్లు చెబుతున్నారు. సరైన సౌకర్యాలు కల్పించక పోవడంతో సర్జికల్ అంకాలజీ విభాగంలో సైతం శస్త్ర చికిత్సలు జరగడం లేదు. గతంలో అరుదైన జబ్బులకు ఖరీదైన ఇంజెక్షన్‌లను ప్రభుత్వం సరఫరా చేసేదని, ఇప్పుడు మందులు కూడా అరకొరగా ఉండటంతో చేసేది లేక రోగులు బయట కొనుగోలు చేయాల్సిన దయనీయ స్థితి నెలకొందంటున్నారు.
అక్కరకు రాని విజయవాడ జీజీహెచ్
కూటమి ప్రభుత్వంలో
దిగజారిన సూపర్ స్పెషాలిటీ సేవలు
వైద్యం లేక ప్రైవేటుకు
తరలిపోతున్న వైనం
సీటీ సర్జరీ, యూరాలజీ సర్జరీల
కోసం ఎదురు చూపులు
ఖరీదైన ఇంజెక్షన్‌లు సరఫరా
చేయని ప్రభుత్వం
దయనీయ స్థితిలో విజయవాడ
ప్రభుత్వాస్పత్రి
గతంలో ప్రభుత్వాస్పత్రిలో నాణ్యమైన సేవలు అందేవి. ఇప్పుడు రోగులు వెళ్తుంటే మందులు లేవు, పరీక్షలు లేవు అంటున్నారు. ఎంఆర్‌ఐ రాస్తే పది రోజుల తర్వాత రమ్మని చెబుతున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. పేదలు వైద్య ఖర్చులు భరించలేక అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
– తోకల శ్యామ్‌కుమార్, బాడవపేట

సేవలు దిగజారాయి..