
లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు
కారులో ఉన్న వ్యక్తి క్షేమం
కృష్ణలంక(విజయవాడతూర్పు): లారీని ఓవర్‌టేక్ చేస్తున్న ఓ కారు అదే లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన ఘటన రాణిగారితోట నేతాజీ వంతెన వద్ద జరిగింది. కృష్ణలంక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం పీడీఎస్ రైస్ ఖాళీ లారీ గుంటూరు నుంచి వారధి ఫ్‌లై ఓవర్ మీదుగా ఏలూరుకు వెళ్తోంది. అదే సమయంలో అదే ఫ్లై ఓవర్ మీదుగా గుంటూరు నుంచి బెంజిసర్కిల్ వైపు ఒక కారు వెళ్తోంది. రెండు వాహనాలు నేతాజీ వంతెన వద్దకు చేరుకోగానే కారు కుడివైపు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి ముందు వెళ్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి ఒక్కసారిగా కుడివైపునకు తిప్పాడు. ఈ ప్రమాదంలో కారు వెనుకభాగం లారీకి ఎడమవైపు తగలడంతో అదుపుతప్పిన కారు జాతీయ రహదారిపై చక్కర్లు కొట్టుకుంటూ రోడ్డు మధ్యలో ఉన్న ఐరన్ డివైడర్ పైకి ఎక్కి మళ్లీ లారీని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారు మాత్రం నుజ్జునుజ్జు అయింది. సినీఫక్కీలో జరిగిన ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు డివైడర్ పైకి ఎక్కిన కారును క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని వివరాలు సేకరించారు.