రేపు జంగుబాయి ఆలయంలో ముందస్తు దసరా ఉత్సవం తరలిరానున్న వేలాది మంది భక్తులు పలు పనులు చేపట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాల కల్పనపై ఆలయ కమిటీ ప్రధాన దృష్టి
కెరమెరి: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం ముకదంగూడ పంచాయతీ మహరాజ్గూడ అడవుల్లో కొలువైన జంగుబాయి పుణ్యక్షేత్రం అభివృద్ధి పనులతో కళకళలాడుతోంది. ఈ నెల 15న ఉదయం ఆలయ ప్రాంగణంలో ఆదివాసీ లు భక్తిశ్రద్ధలతో ముందస్తు దసరా వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో క్షేత్రంలో పలు రకాల పనులు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఆదివాసీ భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ఆలయ కమి టీ సభ్యులు సౌకర్యాల కల్పనపై దృష్టి సారించారు. అయితే అభివృద్ధి పనుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొన్ని పనులు అసంపూర్తిగానే ఉండడం చర్చనీయాంశంగా మారింది.
మూడేళ్లుగా నిర్మాణ దశలోనే..
జంగుబాయి ఆలయానికి మంజూరైన తాగునీటి ట్యాంకు మూడేళ్లుగా నిర్మాణ దశలోనే ఉంది. 30 వే ల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ట్యాంకుకు ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసినప్పటికీ నిధులు విడుదల చేయలేదు. నత్తనడకన పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బోరు నీరు అందుబాటులో ఉంది. మరో ఐదారు నెలల తర్వాత భూగర్భజలం ఇంకిపోతే నీటి తిప్పలు తప్పవు. శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు.
ఆది నుంచి తెలంగాణ ప్రభుత్వం జంగుబాయి ఆలయ అభివృద్ధిపై చిన్నచూపు చూస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర అధికార యంత్రాంగం ఇక్కడ ఆరు రేకుల షెడ్లు నిర్మించారు. అందులో ఎంపీ నిధులతో 2, ఎమ్మెల్యే నిధులతో 2, మంత్రి సీతక్క నిధులతో 2 ఏర్పాటు చేశారు. అయితే నేలపై ఫ్లోరింగ్ లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్ల క్రితమే మంత్రి రూ.50 లక్షల నిధులు అభివృద్ధి పనులకు మంజూరు చేసినప్పటికీ నేటికి నయాపైసా రాలేదని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. షెడ్లు ఉన్నప్పటికీ కూర్చోడానికి అనువైన సదుపాయం లేక బండరాళ్లు వారికి దిక్కవుతున్నాయి. ఉత్సవాల సమయంలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చే వారికి ఈ పరిస్థితి అసౌకర్యంగా మారుతోంది. ఫ్లోరింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
మన పనులు అసంపూర్తి
వసతుల కల్పనలో మహారాష్ట్ర
భక్తులకు ఇబ్బందులు కలగకుండా మహా రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు కల్పించింది. పోచమ్మ ఆలయం సమీపంలో భక్తులు సేదతీరేందుకు రేకుల షెడ్డు నిర్మించింది. అలాగే పూజల సమయంలో నైవేద్యం తయారు చేసేందుకు ఆకట్టుకునే మరో షెడ్డు పనులు కొనసాగుతుండగా, బుధవారం సాయంత్రం వరకు పూర్తి చేసే అవకాశం ఉంది. గతంలోనూ భక్తుల రాకపోకలకు వీలుగా వంతెన నిర్మించారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని రాజూరా ఎమ్మెల్యేకు మహారాష్ట్ర కమిటీ సభ్యులు తెలపడంతో ప్రత్యేకంగా త్రీఫేజ్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేశారు. అమ్మవారి గుహకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా మెట్లతోపాటు భక్తినివాస్ భవనం నిర్మించారు. వీటి కోసం సుమారు రూ.60 లక్షల వరకు ఖర్చు చేశారు.


