రీసర్వేతో పక్కాగా హద్దులు
పెంచికల్పేట్: భూముల రీసర్వేతో గ్రామాల హద్దులు పక్కాగా ఉంటాయని కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి అన్నారు. మండలంలోని గొంట్లపేట్ గ్రామంలో కొనసాగుతున్న రీసర్వేను మంగళవారం తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో సర్వే పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఎల్క పల్లి పెద్దవాగు వద్ద ఇసుక క్వారీని పరిశీలించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయ న వెంట తహసీల్దార్ రవీందర్, సర్వేయర్ ధన్రాజ్, సిబ్బంది ఉన్నారు.
ఎల్నినోతో పెరిగిన విద్యుత్ డిమాండ్
ఆసిఫాబాద్అర్బన్: ఎల్నినో వాతావరణ పరిస్థితులతో జిల్లాలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని ఎస్ఈ ఉత్తమ్ జాడె ఒక ప్రకటనలో తెలిపారు. లోటు వర్షపాతం, ఎండల తీవ్రతతో ఏసీలు, కూలర్ల వాడకంతో రోజు వారీ విద్యుత్ వినియోగం సాధారణ స్థాయిని మించిపోయిందని పేర్కొన్నారు. భూగర్భ జలాలు తగ్గడం, పంటలను కాపాడుకునేందుకు రైతులు మోటార్లు నడపడం కూడా విద్యుత్ వ్యవస్థపై అదనపు భారం మోపుతుందని తెలిపారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
21 నుంచి పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమాలు
ఆసిఫాబాదఅర్బన్: జిల్లాలో ఈ నెల 21 నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నితిక పంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు ఫ్లాగ్ డే సందర్భంగా జిల్లా పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్తూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్జయంతి సందర్భంగా ఈ నెల 31న నిర్వహించే జాతీయ ఐక్యత దినోత్సవం వరకు పలు కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.


