ప్రగతి అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

ప్రగతి అంతంతే..

Oct 11 2026 12:21 AM | Updated on Oct 11 2026 12:21 AM

● పదేళ్ల పాలన.. అభివృద్ధి మూలన ● ప్రత్యేక జిల్లాగా ఏర్పడ్డా ఫలితమేది? ● పాలన చేరువైనా మిగిలిన సమస్యలు ● జిల్లావాసులకు తప్పని ఇబ్బందులు

నెరవేరిన దశాబ్దాల డిమాండ్‌

ఆసిఫాబాద్‌: పాలన చేరువైంది.. కానీ, సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయి. వెనుకబడిన అటవీ ప్రాంతమైన ఆసిఫాబాద్‌ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటై పదేళ్లవుతోంది. 2016 అక్టోబర్‌ 11దసరా రోజున అప్పటి సీఎం కేసీఆర్‌ 21కొత్త జిల్లాలతో పాటు ఆసిఫాబాద్‌ ను 31వ జిల్లాగా ప్రకటించి గిరిజన పోరాటయోధుడు కుమురం భీమ్‌ పేరు పెట్టారు. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లా ఏర్పాటై పదేళ్లవుతున్నా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. జిల్లా ఏర్పడ్డాక జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పాటుతో ప్రధానంగా ఇక్కడి ప్రజలకు దూరభారం తప్పినా అభివృద్ధిలో పెద్దగా మార్పులేదు.

గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు లేక..

జిల్లాలో విద్య, వైద్య సేవలు ఇప్పటికీ అంతంత మాత్రంగానే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు సరై న రోడ్లు లేక వానాకాలంలో అత్యవసర సేవలందక గ్రామీణులు ఇక్కట్లకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో ఇరుకు రోడ్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల నాటి డ్రైనేజీలు కూడుకుపోయి రోడ్లపై మురుగునీరు పారుతోంది. దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల జాబితాల్లో కుమురంభీం ఆసిపాబాద్‌ ఉండడం గమనార్హం.

ఇదీ.. చారిత్రక నేపథ్యం

గోండు రాజుల కాలం నాటి ఆసిఫాబాద్‌కు చారిత్ర క నేపథ్యం ఉంది. నైజాం కాలంలో ఆసిఫాబాద్‌ను జనగామగా పిలిచేవారు. హైదరాబాద్‌ సంస్థానాదీ శుడిగా ఉన్న ఆజంజాహి వంశానికి చెందిన నిజాం నవాబు 1907లో ఈ ప్రాంతానికి ఆసిఫాబాద్‌గా నామకరణం చేశారు. హైదరాబాద్‌ నుంచి రైలు మార్గం ఈ ప్రాంతం గుండా వెళ్తుండగా రెబ్బెనలోని రైల్వేస్టేషన్‌ను ఆసిఫాబాద్‌ రోడ్‌గా మార్చారు. నైజాంల కాలంలో పాలనా సౌలభ్యం కోసం 1913 నుంచి 1940 వరకు ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌కు తరలిపోయినా, ఆసిఫాబాద్‌ మాత్రం విశిష్టతను కాపాడుకుంటూ వస్తోంది. నిజాం నాటి కార్యాలయ భవనాలు నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తాయి. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లోగల స్పెషల్‌ సబ్‌జైలు నిజాం కాలం నాటిదే. ఇప్పటికీ సబ్‌జైలు కొనసాగుతోంది. ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొన్నటి వరకు నిజాం కాలంనాటి భవనంలోనే కొనసాగింది. నైజాం రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆర్టీసీ డిపో ఇక్కడ ఏర్పాటు చేశారు.

వైద్యసేవలు నామమాత్రమే..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల కొర త వేదిస్తోంది. ప్రభుత్వాస్పత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి 330 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రే డ్‌ చేశారు. స్థాయి పెంచినా 20శాతమే వైద్యులుండడంతో ప్రాథమిక చికిత్సకే పరిమితమవుతోంది. సూపరింటెండెంట్‌తో పాటు 188 మంది వైద్యులుండాల్సి ఉండగా 25మందే విధులు నిర్వహిస్తుండగా ఇందులో నలుగురే రెగ్యులర్‌ వైద్యులున్నారు. నిత్యం సుమారు 600 ఔట్‌ పేషెంట్లు నమోదవుతుందగా, పదుల సంఖ్యలో ఇన్‌పేషెంట్లు చేరుతున్నారు. కొత్తగా ఏర్పాటైన మెడికల్‌ కళాశాలలో నీట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా ఏటా 100 మంది చొప్పున 400 విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదేశాల మేరకు తొలుత 300 పడకల ఆస్పత్రి కోసం నిర్మిస్తున్న భవనాన్ని ప్రస్తుతం వైద్య కళాశా లగా మార్చారు. ఇటీవల ఆస్పత్రిలో ఇద్దరు గైనకా లజిస్టులు రావడంతో తరచూ సిజేరియన్లుజరుగుతున్నాయి. వైద్య కళాశాలలోనూ 20శాతమే బోధన సిబ్బంది ఉండడంతో ఇబ్బందిగా మారింది.

సాంకేతిక విద్యకు దూరం

జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ కళాశాలలు లేకపోవడం పాలకుల పని తీరుకు నిదర్శనం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అందని ద్రాక్షగానే మిగిలింది. దీంతో జిల్లాకు చెందిన పేద విద్యార్థులు ఉన్నత విద్యకు నోచుకోవడంలేదు.

సమీకృతం.. సర్వాంగ సుందరం

పంచాయతీ టు మున్సిపాలిటీ

గతంలో మేజర్‌ గ్రామపంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్‌ 2024లో 20వార్డులతో మున్సి పాలిటీగా అప్‌గ్రేడ్‌ అయింది. పట్టణంలో రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా స్కూల్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గిరిజన గూడేలకు పంచాయతీ హోదా, పోడు భూములకు పట్టాలు, రైతు భరోసా, దళిత బంధు, గిరిజన బంధు, ఇందిరమ్మ తదితర పథకాలు అమలవుతున్నాయి

ప్రాజెక్ట్‌ల పరిస్థితి అధ్వానం

రూ.750 కోట్లతో నిర్మించిన కుమురంభీమ్‌ ప్రాజెక్ట్‌ తాగునీటి అవసరాలు తీర్చడంతోపా టు చేపల చెరువుగా మారింది. కట్టకు పగుళ్లు తేలి ప్రమాదకరంగా తయారైంది. అసంపూర్తి కాల్వల నిర్మాణంతో సాగునీరందని పరిస్థితి నెలకొంది. రూ.120కోట్లతో నిర్మించిన వట్టివాగు ప్రాజెక్ట్‌ కాలువలు మరమ్మతుకు నోచుకోక సాగునీరందని పరిస్థితి ఉంది. జగన్నాథ్‌పూర్‌, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులూ ముందుకు సాగడంలేదు. ఏటా అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టాల పాలవుతున్నారు.

ఇన్‌చార్జీలతోనే కాలం వెల్లదీత

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇన్‌చార్జీలతో కాలం వెల్లదీస్తున్నారు. రెగ్యులర్‌ అధికా రులను నియమించక పోవడంతో 30శాతం సిబ్బందితోనే మమ అనిపిస్తున్నారు. ఇన్‌చార్జి జిల్లా అధికారులతో పాటు ఒక్కొక్కరికి అదనంగా మరో శాఖ కేటాయించడంతో ప్రజలతోపాటు వారికీ ఇబ్బందులు తప్పడంలేదు. ఇక్కడ పని చేసే అధికారులు మంచిర్యాల, కా గజ్‌నగర్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

ఏళ్లుగా పూర్తి కాని అభివృద్ధి పనులు

రూ.8.5 కోట్లతో నిర్మిస్తున్న గుండి బ్రిడ్జి 20 ఏళ్లుగా పునాదులకే పరిమితమైంది. దీంతో గుండి, భీమ్‌పూర్‌, రహపెల్లితో పాటు సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కెరమెరి మండలం ఆనార్‌పల్లితో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టక పోవడంతో ఏటా వర్షాకాలం గ్రామీణులు అవస్థలు పడుతున్నారు.

జిల్లా కేంద్రంలో 22 ఎకరాల స్థలంలో జీ+2 పద్ధతిన 1.39 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అ త్యాధునిక హంగులతో రూ.52.20కోట్లతో కలెక్టరేట్‌ భవనం నిర్మించారు. ఇందులో 37శాఖల కా ర్యాలయాలు నిర్వహిస్తుండగా అన్ని సేవలు ఒకేచోట అందుబాటులోకి వచ్చాయి. రూ.8.76 కో ట్లతో అధికారుల నివాస భవనాలూ నిర్మించా రు. సుమారు రూ.25కోట్లతో జిల్లా పోలీస్‌ కా ర్యాలయ భవనాన్ని 18ఎకరాల్లో 45వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+3 పద్ధతిలో నిర్మించారు. ఇందులో 50వరకు పెద్ద గదులున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement