ఆసిఫాబాద్‌రూరల్: క్రీడాకారుల కలలకు రెక్కలు తొడుగుతున్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మొదటిసారి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వేదిక అవుతోంది. ఇందుకోసం సుమారు రూ.6.50 లక్షలతో జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ బాలికల మైదానంలో రన్నింగ్ ట్రాక్, చుట్టూ వాల్‌తోపాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పోటీలకు రాష్ట్రంలోని 33జిల్లాల నుంచి రానున్న 1,500 మంది క్రీడాకారులు, 200మంది కోచ్‌లు, మేనేజర్లు, సాంకేతిక సిబ్బందికి ఆతిథ్యం ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను అట్టహాసంగా నిర్వహించేందుకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేసింది.
క్రీడలు, విభాగాలు ఇలా..
ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ అండర్–10, 12, 14 విభాగాల్లో 14 ఈవెంట్లు నిర్వహించనున్నారు. అండర్–10 సబ్ జూనియర్ విభాగంలో 60 మీటర్లు, 200 మీటర్ల రన్నింగ్, 5 మీటర్ల అప్రోచ్, లాంగ్ జంప్ ఉంటుంది. అండర్–12 విభాగంలో 60 మీటర్లు, 300 మీటర్ల రన్నింగ్, 5 మీటర్ల అప్రోచ్, లాంగ్‌జంప్, కిడ్స్ జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తారు. అండర్–14 విభాగంలో 60 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, ట్రయత్లాన్, ఏబీసీ, కిడ్స్ జావెలిన్ త్రో పోటీలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు..
ఆసిఫాబాద్ ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లాలో అథ్లెటిక్స్ అభివృద్ధి, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో 2021లో జిల్లాలో ఈ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్‌కు అనుబంధంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం 30కి పైగా జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా అథ్లెట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనగా 150మంది పతకాలు సాధించారు. మరో 50మంది జాతీయ స్థాయికి ఎంపిక కాగా, 15 మంది పతకాలు కై వసం చేసుకున్నారు.


