నాలుగో విడత ఈ నెల 13 నుంచి 18 వరకు జిల్లా పోలీస్, రవాణా, ఇతర శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు
ఆసిఫాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం మరోసారి అరైవ్–అలైవ్ కార్యక్రమం చేపట్టనుంది. పోలీసు శాఖ దీనిని కేవలం కార్యక్రమంగా కాకుండా ఒక పబ్లిక్ అవగాహన ఉద్యమంగా అమలు చేస్తోంది. ఇది ఒక రోడ్డు భద్రతా ప్రచా రమే కాదు.. సురక్షితంగా ఇంటికి చేరడం ముఖ్యం అనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడమే లక్ష్యం. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు వివి ధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమానికి అనుగుణంగా అవగాహ న, తనిఖీ, అమలు చర్యలు చేపట్టనున్నారు. జిల్లా పోలీస్, రవాణా, ఇతర శాఖల సమన్వయంతో బ్లాక్ స్పాట్లు, విద్యాసంస్థలు, బస్టాండ్లు, ముఖ్య కూడళ్ల వద్ద అవగాహన సభలు, ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలో గతేడాది డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 3,757 కేసులు నమోదు కాగా, ఈ చలాన్ ద్వారా 1,04,526 కేసుల్లో రూ.1.97 కోట్ల జరిమానా విధించారు.
భద్రతే లక్ష్యంగా..
జిల్లాలో మొదటి విడత అరైవ్–అలైవ్ కార్యక్రమం గత జనవరి 13 నుంచి 24 వరకు, రెండో విడత ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు, మూడో విడత మార్చి 22 నుంచి 28 వరకు నిర్వహించారు. ప్రస్తుతం ఈ నెల 13 నుంచి నాలుగో విడతకు సిద్ధమవుతున్నారు. గత జనవరి నుంచి మార్చివరకు జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో 2 కంటి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి 161 మంది డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమున్న 30 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 412 అవగాహన కార్యక్రమాలు చేపట్టగా 14,676 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రెబ్బెన, కెరమెరి పోలీస్‌స్టేషన్లలో హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ నెల 12న కెరమెరి పోలీస్‌స్టేషన్ పరిధిలో 250 హెల్మెట్లు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్‌పోస్టు ప్రాంతంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్న అవగాహన కలిగించేలా హెల్మెట్ చౌక్ (హెల్మెట్ ఆకారంలో ఉన్న భారీ నిర్మాణం) ఏర్పాటు చేయనున్నారు.
అవగాహన కార్యక్రమాలు
అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన జంక్షన్లు, బస్టాండ్లు, పాఠశాలలు, కళాశాలల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. హెల్మెట్, సీట్ బెల్ట్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ఓవర్‌స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రచారం. డ్రైవర్లు, ఆటో, లారీ, బస్సుల యజమానులకు రహదారి భద్రతపై శిక్షణ, బైక్ ర్యాలీలు, కరపత్రాల పంపిణీ, మైక్ అనౌన్స్‌మెంట్లు చేస్తారు. పోలీసు, రవాణా శాఖ సంయుక్త తనిఖీలు, ఈ చలాన్ అమలు, నియమాల ఉల్లంఘనపై చర్యల తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రచారంలో మద్య సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి పాటించడం, ప్రమాదకర ప్రదేశాల్లో అవగాహన, పాఠశాలలు, మార్కెట్లు, బస్టాండుల్లో ప్రచారం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.
నిబంధనలు పాటించాలి
వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి. నాలుగో విడత అరైవ్ అలైవ్ కార్యక్రమం ఈ నెల 13 నుంచి 18 వరకు జిల్లాలో కొనసాగుతుంది. ప్రజల భద్రతే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలి.
– నితిక పంత్, ఎస్పీ


