కొత్త పెన్షన్ల మంజూరు కోసం ఎదురుచూపులు
జిల్లాలో నాలుగు వేలకు పైగా దరఖాస్తులు
కార్యాలయాల చుట్టూ అర్హుల ప్రదక్షిణలు
ప్రభుత్వ ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు
కౌటాల మండలం యాపలగూడ గ్రామానికి చెందిన బెడ్డల తుర్సబాయి భర్త నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త చనిపోయిన తర్వాత ఆమె పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఇంటిపెద్ద లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అధికారులు, ప్రజాప్ర తినిధులను వేడుకుంటున్నా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు కొత్త పింఛన్ల అంశాన్ని లేవనెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు సిర్పూర్ నియోజకవర్గంలో ఒక్కరికీ కొత్త పింఛన్ మంజూరు కాలేదని స్పష్టం చేశారు. కుటుంబ పోషణకు ఆసరా లేక వితంతువులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, పింఛన్ల దరఖాస్తులు వేలాదిగా పెండింగ్‌లోనే ఉన్నాయని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు.
కౌటాల: మలి వయస్సులో తోడెవరూ లేక వృద్ధులు ఆర్థిక ఇబ్బందులతో గోస పడుతుండగా.. వైకల్యంతో ఏ పని చేయలేక చేయూత కోసం దివ్యాంగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సాయం కోసం వీరంతా తిరగని ఆఫీసులు లేవు. అడగని అధికారి లేరు. అయినా ఫలితం మాత్రం శూన్యం. ఏళ్లుగా కొత్త పింఛన్ల జాడ లేకపోవడంతో అర్హులకు చేయూత లేక అవస్థలు పడుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టులో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. అప్పటి నుంచి మళ్లీ మంజూరు కాలేదని అర్హులు చెబుతున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో నూతనంగా 2 లక్షల నూతన పింఛన్ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
ప్రజావాణికి వినతుల వెల్లువ
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 52,635 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా నగదు సాయం అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కానీ కొత్త పింఛన్ల కోసం అర్హులు ప్రతీ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో వినతులు సమర్పిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కరుణించేవారు కరువయ్యారు వృద్ధులు మృతి చెందితే వెంటనే వారికి వచ్చే వృద్ధాప్య పింఛన్ నిలిపివేస్తున్నారు. కానీ ఆ వృద్ధుడి భార్యకు మాత్రం కొత్తగా మంజూరు చేయడం లేదు. జిల్లాలో చేయూత పింఛన్ల కోసం నాలుగు వేలకు పైగానే దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య 982, వితంతు పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులు 2,147 ఉన్నాయి.
అందుబాటులో లేని పోర్టల్
వృద్ధాప్యంలో ఉన్నవారితోపాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, తదితరులకు రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా పింఛన్ అందించి భరోసా కల్పిస్తోంది. కొత్త పింఛన్ల కోసం దరఖా స్తులు చేసుకునే ఆసరా పోర్టల్ 2022 ఆగస్టు నుంచి అందుబాటులో లేదు. నూతన ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి కాంగ్రెస్ 27 నెలలు గడిచిపోగా, నాలుగేళ్లకు పైగా కొత్తవాటి జాడ లేకుండా పోయింది. ప్రస్తుతం నాలుగు వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, అర్హతలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వడపోసినా కనీసం మూడు వేలకు మందికి పైగానే కొత్త పింఛన్లు పొందే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒంటరి మహిళలు 248
దివ్యాంగులు 654
వృద్ధులు 982
వితంతువులు 2,147
మొత్తం 4,031


