ఆసిఫాబాద్‌అర్బన్: ఆర్టిజన్లు, అన్‌మాన్, పీస్ రేట్, స్పాట్ బిల్లర్, ఇతర కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె కొనసాగుతోందని తెలంగాణ విద్యుత్ అర్టిజన్లు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ మారుతి, కన్వీనర్ షేక్ నసీరొద్దీన్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిరవధిక సమ్మె చేపట్టారు. వారు మాట్లాడుతూ ఒకే సంస్థలో రెండు నిబంధనలు అమలు చేయడం సరికాదన్నారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేసి, విద్యార్హతలకు అనుగుణంగా కన్వర్షన్ చేయాలన్నారు. అన్‌మాన్ కార్మికులను ఆర్టిజన్‌గా గుర్తించాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని కోరారు. 2026 పీఆర్సీ ప్రకారం వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా, డివిజన్ కమిటీల నాయకులు బుచ్చి బాబు, లక్ష్మణ్, రాజేశ్, సతీశ్, మల్లేశ్, శిరీష, శ్రీకాంత్, రమేశ్, సలీం పాషా, సాగర్, ఏకాంబరం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


