కాగజ్‌నగర్‌టౌన్: బీజేపీ పట్టణ అధ్యక్షుడు కె.శివకుమార్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలంకు అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తాను గతంలో దేశ సైనికుడిగా సరిహద్దుల్లో సేవ చేశానని, అనంతరం పంచాయతీ సెక్రెటరీగా పని చేశానన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తాను వ్యక్తిగతంగా లాభం ఆశించకుండా సేవా భావంతో, హిందూ ధర్మంపై ఉన్న నమ్మకంతో భారతీయ జనతా పార్టీలో చేరానని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్ష పదవిని ఇచ్చిందన్నారు. అనివార్య కారణాలు, సంస్థాగత లోపాలు తనను వెనక్కి నెట్టివేశాయని, దీంతో పట్టణ అధ్యక్షుడిగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వంలో కొనసాగుతూ నా చివరి శ్వాసవరకు ధర్మం, దేశం కోసం పోరాడుతానని స్పష్టం చేశారు.


