రెబ్బెన: అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు ఒకపూట భోజనం అందిస్తుండగా, తాజాగా చిన్నారులకు అల్పాహారం అందించనున్నారు. ఈ పథకానికి ‘తొలిముద్ద’గా నామకరణం చేయగా, ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ‘రెడీ టు కుక్’ విధానంలో ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి పదార్థాలు అందించేలా పథకాన్ని రూపొందించారు. అయితే పథకం అమలుకు సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలపై ప్రభుత్వం ఇంకా స్పష్టతనివ్వలేదు. త్వరలో ఉత్తర్వులు రాగానే జిల్లాలోనూ ప్రారంభిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి.
45,708 మంది చిన్నారులు
జిల్లాలోని 15 మండలాలు పరిధిలో ఆసిఫాబాద్, జైనూర్, వాంకిడి, సిర్పూర్(టి), కాగజ్‌నగర్ ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. 1,006 అంగన్‌వాడీ కేంద్రాల్లో 45,708 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. తాజాగా అమలు చేయనున్న ‘తొలిముద్ద’ పథకం ద్వారా వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో అందడం లేదు. చాలామంది నేటికీ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిముద్ద పేరుతో చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించాలని నిర్ణయించింది. అయితే అంగన్‌వాడీ కేంద్రాల్లో 0– 5 సంవత్సరాల లోపు చిన్నారులు ఉండగా, వారిలో ఏ వయసు వారికి అల్పాహారం అందజేస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది.
ఉత్తర్వులు రాలేదు
రాష్ట్ర ప్రభుత్వం తొలిముద్ద అల్పాహారం పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. ఏ వయసు చిన్నారులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారో ఇంకా తెలియలేదు. చిన్నారులకు అందించే అల్పాహారం రెడీ టు కుక్ విధానంలో ఉప్మా, కిచిడీ మిక్స్ వంటి పదార్థాలు ఉంటాయని చెబుతున్నారు. వాటిని అంగన్‌వాడీ కేంద్రాల్లో సిద్ధం చేసి పిల్లలకు అందించాలా? లేక ప్యాకెట్లను నేరుగా పంపిణీ చేయాలా? అన్నది ప్రభుత్వం నుంచి అందే ఉత్తర్వుల్లో ఉంటుంది. ఆదేశాలు రాగానే పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడతాం.
– భాస్కర్, ఐసీడీఎస్ పీడీ


